పన్నీర్ సెల్వం పై వేటు.. పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు
చెన్నై (CLiC2NEWS): తమినాట ప్రధాన రాజకీయ పార్టీ అయిన అన్నాడిఎంకెలో రెండు వారాలుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. పార్టీ పగ్గాలు ఎడప్పాడి పలనిస్వామి చేతికి చేరాయి. దాంతో అన్నాడిఎంకె నాయకత్వం పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై బహిష్కరణ వేటు వేసింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయడంతో పాటు సహ కోశాధికారి పదవి నుంచి తొలగించింది. ఆయన మద్దతు దారులను కూడా పార్టీ నుంచి బహిష్కరించింది. వారి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది.
కాగా చెన్నైలో పళనిస్వామి ఆధ్వర్యంలో పార్టీ సర్వసభ్య భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో మొదట ద్వంద నాయకత్వాన్ని రద్దు చేసిన మండలి.. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని పునరుద్ధరించాలని నిర్ణయించింది. రానున్న నాలుగు నెలల్లోగా ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించింది. అప్పటి వరకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని స్వామిని ఎన్నుకుంది.