కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు అనుమతివ్వండి: బండి సంజయ్
హైదరాబాద్ (CLiC2NEWS): కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. ప్రాజెక్టు సందర్శనకు మొత్తం 30 మంది వెళ్లనున్నారని, వీరిలో బిజెపికి చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ నిపుణులు ఉన్నట్లు, వీరంతా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రాజెక్టు సందర్శనకు వెళ్లామని సిఎస్ సోమేశ్ కుమార్‌కు బండిసంజయ్ లేఖ రాశారు.
భారీ వరదల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మోటార్లకు జరిగిన నష్టాన్ని పరిశీలించడమే బిజెపి బృందం లక్ష్యమని లేఖలో పేర్కొన్నారు. 1998 వరదలతో శ్రీశైలం ప్రాజెక్టులో టర్బైన్స్ దెబ్బతిన్నపుడు ప్రతిపక్షాలు ప్రాజెక్టును సందర్శించాయని.. 2004-09 మధ్య జరిగిన జలయజ్ఞం పనులపై వచ్చిన విమర్శలకు అప్పటి ప్రభుత్వం ప్రతిపక్షాలను ఆహ్వానించి అనుమానాలను నివృత్తి చేసిందని గుర్తు చేశారు. అదేవిధంగా మా సందేహాలను నివృత్తి చేయాలని బండి సంజయ్ లేఖలో కోరారు.