AP: మంత్రి అంబటి రాంబాబుకి తృటిలో తప్పిన ప్రమాదం..

సత్తుపల్లి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు ప్రయాణిస్తున్న కారుకి తృటిలో ప్రమాదం తప్పింది. పోలీసులు తెలపిన వివరాల మేరకు.. సత్తుపల్లి శివారు ప్రాంతంలో మంత్రి ప్రయాణిస్తున్న కారుపై గోధుమ బస్తాలు పడగా.. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పినట్లు తెలిపారు. గోధుమ బస్తాల లోడుతో విశాఖకు వెళ్తున్న ఓ లారీకి ఎదురుగా వస్తున్న వాహనంలో కర్రలు తగిలి తాళ్లు తెగిపోయాయి. దీంతో బస్తాలు కిందికి పడిపోతున్నాయి. ఈ క్రమంలో రెండు గోధుమ బస్తాలు మంత్రి కారు బానెట్‌పై పడ్డాయి. డ్రైవర్ వెంటనే బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పినట్లు సమాచారం. దీంతో కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది. అనంతరం మంత్రి వేరో కారులో వెళ్లారు.