తిరుప‌తిలోని రుయా ఆస్ప‌త్రి అంబులెన్స్ ఘ‌ట‌న‌..

సిఎస్ఆర్ఎంఓ స‌స్పెన్ష‌న్‌

తిరుప‌తి (CLiC2NEWS): తిరుప‌తిలోని రుయా ఆస్ప‌త్రి వ‌ద్ద జ‌రిగిన అంబులెన్స్ ఘ‌ట‌న‌పై ఎపి ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ప్ర‌త్యేక బృందం ఏర్పాటు చేసింది. రుయా ఆస్ప‌త్రి వ‌ద్ద విచార‌ణ జ‌రిపిన అనంత‌రం ప్ర‌త్యేక బృందం నివేదిక‌ను త‌యారుచేసింది. నివేదిక ప్ర‌కారం అంబులెన్స్ ఘ‌ట‌న నిజ‌మేన‌ని తేలింది. దీంతో ఆస్ప‌త్రి సిఎస్ ఆర్ ఎంఓ స‌ర‌స్వ‌తి దేవిని స‌స్పెండ్ చేయ‌గా.. సూప‌రింటెండెంట్ భార‌తికి షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఈ మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌ట‌ర‌మణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

వివ‌రాలు. అన్న‌మ‌య్య జిల్లా చిట్వేలికి చెందిన మామిడితోటలో కూలీగా ప‌నిచేసే వ్య‌క్తి త‌న కుమారుడు ఆనారోగ్యంతో ఉండ‌టంతో ఇటీవ‌ల తిరుప‌తి రుయాకు తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ కిడ్నీ, కాలేయం పూర్తిగా ప‌నిచేయ‌క‌పోవ‌డంతో బాలుడు నిన్న రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో మృతిచెందాడు. బాలుడిని తిరుప‌తి నుంచి 90 కి.మీ దూరంలో ఉన్న చిట్వేలికి తీసుకెళ్ల‌డానికి రుయా అంబులెన్స్ డ్రైవ‌ర్లు రూ. 10 వేలు అవుతుంద‌ని చెప్పారు. అంత మొత్తం భ‌రించ‌లేని తండ్రి ఈ విష‌యాన్ని స్వ‌గ్రామంలో ఉన్న త‌మ బంధువుల‌కు తెల‌ప‌గా.. వారు ఉచిత అంబులెన్స్ను రుయాకు పంపారు.

అయితే ఆ అంబులెన్స్ డ్రైవ‌ర్‌ను రుయా అంబులెన్స్ డ్రైవ‌ర్లు కొట్టి పంపేశారు. త‌మ అంబులెన్స్‌లోనే మృత‌దేహాన్ని తీసుకెళ్లాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. దీంతో బాలుడి తండ్రి ద్విచ‌క్ర వాహ‌నంపై కుమారిడిని స్వ‌గ్రామానికి తీసుకెళ్లారు. ఈ ఆమాన‌వీయ ఘ‌ట‌న‌పై ప్ర‌జా సంఘాలు, వివిధ రాజ‌కీయ పార్టీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఓ బృందాన్ని ఏర్పాటు చేసి విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించింది. ఆ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా క‌లెక్ట‌ర్ చ‌ర్య‌లు తీసుకున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.