కరోనా కట్టడికి అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం..
కొత్తగా 8,06,493 మందికి పాజిటివ్
వాషింగ్టన్ (CLiC2NEWS): అమెరికాలో రోజూ లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. పలు కట్టడి చర్యలు చేపట్టినప్పటికీ ప్రతిరోజూ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో యుఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లోనే కివిడ్-19 పరీక్షలు చేసుకునేలా 100 కోట్ల ర్యాపిడ్ కిట్లు, వైరస్ బారినపడకుండా రక్షణ కల్పించే ఎన్ 95 మాస్క్‌లను తమ దేశ పౌరులకు ఉచితంగా అందిస్తామని అధ్యక్షుడు జో బైడన్ ప్రకటించారు.
వైద్యుల సైతం కరోనా బారిన పడడంతో ఆస్పత్రులలో వైద్య సిబ్బంది కొరత ఏర్పడింది.వైద్యుల కొరతను అధిగమించేందుకు ఫెడరల్ మెడికల్ సిబ్బందిని ప్రభుత్వం పలు రాష్ట్రాలకు పంపనుంది. అదనంగా మిలిటరీ వైద్యులను సైతం అవసరమైన ప్రాంతాల్లోకి పంపనున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ఉద్ధృతిని కట్టడి చేసేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని అధ్యక్షుడు తెలియజేశారు. టీకా తీసుకున్న వారు ఈ వైరస్ బారిన పడినా తీవ్ర ఆనారోగ్యానికి గురికావటం లేదని వెల్లడించారు.
అమెరికాలో రోజూ లక్షల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో కొత్తగా 8,06,493 మందికి పాజిటివ్‌గా నిర్థారణయ్యింది. 1,969 మంది ఈ మహమ్మారికి బలైనారు. దీంతో అమెరికాలో ఈ వైరస్ బారినపడి మరణించిన వారిసంఖ్య 8,69,212కు చేరింది.