విమోచన దినోత్సవం నిర్వహించేదుకు అన్ని పార్టీలు భయపడ్డాయి: అమిత్ షా

హైదరాబాద్ (CLiC2NEWS): కేంద్ర సర్కార్ ఆధ్వర్యంలో సెప్టెంరు 17 తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగాయి. శనివారం భారతీయ జనతాపార్టీ తలపెట్టిన తెలంగాణ విమోచన వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద నివాళులర్పించారు.
అనంతరం అమిత్‌షా మాట్లాడుతూ.. విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయని.. ఇన్నాళ్లూ ఏ సర్కార్ సాహసించలేదని కేంద్ర హోంమంత్రి అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈ ఏడాది నిర్వహించాలని ప్రధాని మోడీ ఆదేశించారని తెలిపారు.
“దేశమంతటికి స్వాతంత్ర్యం లభించిన ఏడాది తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబరు 17న స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో ఈ ప్రాంత ప్రజలకు విముక్తి లభించింది. ఈ పోరాటంలో ఎందరో ప్రాణాలు అర్పించారు.“ అని అమిత్ షా అన్నరు.
పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర పారామిలటరీ బలగాలు పరేడ్ నిర్వహించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కేంద్రబలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో మహారాష్ట్ర సిఎం ఏక్‌నాథ్ షిండే హాజరయ్యారు.