ఇక అన్నీ ఇంటి వ‌ద్ద‌కే.. బీపీ, షుగర్‌ టెస్ట్‌లు..

హైదరాబాద్ (CLiC2NEWS): ప్ర‌జ‌ల ఆరోగ్య స‌మాచారం సేక‌రించే హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును ప్ర‌భుత్వం త్వ‌ర‌లో ప్రారంభిస్తామని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కెటిఆర్‌ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దీనిని రూపొందించేముందు ప్రయోగాత్మకంగా జిల్లాలైన ములుగు, రాజన్న సిరిసిల్లను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంచుకున్నామని తెలిపారు. ప్రాజెక్టు పురోగతిపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి కెటిఆర్ గురువారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ రెండు జిల్లాల్లోని వైద్యారోగ్యశాఖ సిబ్బంది ఇంటి వద్దే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను సేకరిస్తారని తెలిపారు. బీపీ, మధుమేహం, ప్రాథమిక రక్త, మూత్ర పరీక్షలను అకడికకడే నిర్వహిస్తారని అన్నారు. ఎవరికైనా అదనపు పరీక్షలు అవసరమని భావిస్తే స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ సెంటర్లకు పంపి, పరీక్షలు చేయిస్తారని వివరించారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే వైద్యారోగ్యశాఖ భవిష్యత్తు ప్రణాళికలకు సరైన ప్రాతిపదిక అవుతుందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పౌరుల హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్టు ద్వారా లభించే సమాచారాన్ని విశ్లేషించడం వల్ల వివిధ జిల్లాల్లో ప్రత్యేకంగా ఉన్న వ్యాధులు, సీజనల్‌ వ్యాధుల హెల్త్‌ ట్రెండ్స్‌ను గుర్తించవచ్చని వెల్లడించారు. ఈ సమీక్షలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, డీఎంహెచ్‌ శ్రీనివాసరావు, సీఎంవో ఓఎస్డీ గంగాధర్‌, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.