పదేళ్ల వయసులో ఆల్ ఇండియా రేడియోలో పాట పాడిన వాణీ జయరాం

హైదరాబాద్ (CLiC2NEWS): చిత్ర పరిశ్రమలో మరో విషాదం అలుముకుంది. కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతితో శోకసంద్రంలో ఉండగా మరో విషాదం అలుముకుంది. ప్రముఖ గాయని వాణీ జయరాం మరణించారన్న వార్త తేరుకోకుండా చేసింది. ఆమె మృతి భారత సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటని సినీ ప్రముఖులు వాణీ జయరాం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వాణీ జయరాం వెల్లూరులో నవంబరు 30, 1945వ సంవత్సరంలో జన్మించారు. ఆమె పేరు కలైవాణి. ఆమె పుట్టగానే జాతకం చూసిన సిద్దాంతి.. భవిష్యత్తులో గొప్ప గాయని అవుతుందని, ఆపేరు పెట్టమన్నారట.
వాణీ ఐదేళ్ల వయస్సులో తొలిసారి సంగీతంలో ఓనమాలు దిద్దుకున్నారు. పదేళ్ల వయసులో ఆల్ ఇండియా రేడియోలో మొదటిసారి పాటలు పాడే అవకాశం అందుకున్నారు. అయితే అప్పట్లో శాస్త్రీయ సంగీతాన్ని తప్ప సినీ గీతాలు పాడటం అవమానంగా ఉండేది. ఆ సమయంలో ఆమె రేడియోలో వచ్చిన పాటల్ని చిన్న సౌండ్‌తో పెట్టుకుని కంఠస్తం చేసేవారు. తర్వాత క్రమక్రమంగా ఎలాగైనా సినిమాలలో పాడాలని నిర్ణయించుకున్నారు. ఆమె భర్త జయరాం ద్వారా ఆమె కలనేరవేరింది. 1969లో బాంబేలో మొదట కచేరి ఇచ్చారు. ఆ కచేరి ఆమె జీవితంలో గొప్ప మలుపుకు కారణమైంది. వాణీ జయరాం మొదటి సారిగా గుడ్డీ చిత్రంలో బోలే రే పాట పాడే అవకాశం దక్కింది. ఆపాటకు ఐదు అవార్డులు వచ్చాయి. తెలుగులో మొదటిసారిగా అభిమానవంతుడు చిత్రంలో ఎప్పటివలె కాదురా స్వామి అనే పాటను పాడారు. ఇలా ఆమె తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ , హిందీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురీ ఇలా 14 భాషల్లో ఆమె పాటలు పాడి సంగీత ప్రియులను అలరించారు.