మెగాస్టార్ చిరంజీవికి ఎఎన్ఆర్ అవార్డు: నాగార్జున

హైదరాబాద్ (CLiC2NEWS): ఎఎన్ఆర్ జాతీయ అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వనున్నట్లు అక్కినేని నాగార్జున ప్రకటించారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకొని ఆర్కె సినీ ప్లెక్స్‌లో వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ఎఎన్ఆర్ తమకు నవ్వుతూ జీవిత పాఠాలు నేర్పించారన్నారు. ఎఎన్ఆర్ అవార్డును ఇవ్వనున్నట్లు చిరంజీవికి చెప్పగానే ఆయన ఎమోషనల్ అయ్యారన్నారు. ఈ పురస్కారం ను అక్టోబర్ 28న చిరంజీవికి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు.
ఎఎన్ ఆర్ శత జయంతి వేడుకలో అక్కినేని కుటుంబసభ్యులు, దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. దర్శకేంద్రుడు మాట్లాడుతూ.. అక్కినేని, తమ కుటుంబాలు వేరు కాదన్నారు. హైదరాబాద్‌కు తలమనికమైన అన్నపూర్ణ స్టూడియోస్‌ను ఏర్పాటు చేసి ఎంతోమందికి ఎఎన్ ఆర్ ఉపాధినిచ్చారంటూ కొనియాడారు. విద్యార్థి దశ నుండే తాను ఎఎన్ ఆర్ అభిమానినని మురళీ మోహన్ అన్నారు. అనంతరం ఎఎన్ ఆర్ శత జయంతిని పురస్కరించుకొని తపాలా శాఖ స్టాంప్ విడుదల చేసింది. ఇండియా పోస్టల్ సర్వీసెస్ చీఫ్ పోస్ట్ మాస్టర్ (జనరల్- తెలంగాణ) డా. పివియస్ రెడ్డి పోస్టల్ స్టాంప్‌ను ఆవిష్కరించారు. దివంగత దర్శకుడు బాపు గీసిన చిత్రంతో స్టాంప్‌ను తయారు చేశారు.