AP: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వాలిన సూర్య భాస్కర రావు మృతి

మండపేట (CLiC2NEWS): పీసీసీ మాజీ కార్యదర్శి వాలిన సూర్య భాస్కర రావు (75) శనివారం రాత్రి మృతి చెందారు. ఆయన కొద్ది రోజులుగా అస్వస్తలుగా ఉన్నారు. యువజన కాంగ్రెస్ పార్టీలో తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు గా ఉండి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా సుదీర్ఘ కాలం పనిచేశారు.

మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సూర్య భాస్కర రావు 1985 నుండి 2000 సంవత్సరం వరకు తనదైన ముద్రను రాష్ట్ర రాజకీయాల్లో వేశారు. అందరితోనూ కలుపుగోలుగా తనంగా ఉండి అందరినీ సాదరంగా ఆహ్వానించే వాలిన సూర్య భాస్కరరావు లేరన్న వార్త ఏడిద ప్రజలు మండపేట నియోజకవర్గ ప్రజలు జీర్ణించు కోలేకపోతున్నారు.

ఆలమూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1985లో శాసనసభ స్థానానికి పోటీ చేశారు. డీసీఎంఎస్ అధ్యక్షునిగాను ఏడిద ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షునిగా ఆయన పని చేశారు. రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీలతోను సన్నిహిత సంబంధాలు కలిగిన సూర్య భాస్కర రావు కు ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. యువజన కాంగ్రెస్ లో ఎంతో మంది నాయకులను తయారు చేసి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.

యువజన కాంగ్రెస్ నుండి పీసీసీ సంయుక్త కార్యదర్శి గాను కార్యదర్శిగాను ఆయన పని చేశారు. జిల్లాలో కొందరి పెద్దల కుట్ర వల్ల ఆయన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పదవులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం లోనూ ప్రభుత్వ పదవులు పెద్దగా లభించలేదు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అత్యంత సన్నిహితుడిగా పేరుప్రఖ్యాతులు ఉన్నాయి.

మాజీ ఎంపీ వి.హనుమంతరావు కు ఆయన సుపరిచితులు బాగా కావాల్సిన వ్యక్తి. ఆయనతో యువజన కాంగ్రెస్ లో పనిచేసిన వారందరూ రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేశారు. కన్నా లక్ష్మీనారాయణ ధర్మాన ప్రసాదరావు తదితర నేతలు ఆయనతో ఆయన దగ్గర యువజన కాంగ్రెస్ లో పనిచేసిన వారే. యువజన కాంగ్రెస్ కార్యక్రమాలను రెండు దశాబ్దాల పాటు ఎంతో చిత్తశుద్ధిగా రాష్ట్రంలో అమలు పరిచారు.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ ఆశయాలను ఆయన తూచా తప్పక పాటించి వాటిని అమలు చేసేవారు. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఎదిగిన వాలిన సూర్య భాస్కరరావు మరణంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టు అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరితోనూ ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. అయితే శాసనసభ్యునిగా పని చేయాలన్నా ఆయన చిరకాల వాంఛ నెరవేరలేదు.

ఆలమూరు అసెంబ్లీ రాజకీయాలను బట్టి ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఒక దశలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి అనంతరం తటస్థంగా ఉండిపోయారు. ఇందిరాగాంధీ వీరాభిమానిగా ఉన్న వాలిన సూర్య భాస్కర రావు 1978లో ఇందిరా కాంగ్రెస్ ఏర్పడినప్పుడు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పని చేశారు. ఆయన మంచి వక్తగా పేరుగాంచారు. అదే సమయంలో కడప జిల్లా నుండి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి నారా చంద్రబాబు నాయుడు జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్సులుగా తమ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడం విశేషం.

1975లో విశాఖ ఉక్కు కర్మాగారం ఆందోళనలోను, జై ఆంధ్ర ఉద్యమంలోను వాలిన సూర్య భాస్కరరావు పోరాటం చేశారు. అప్పట్లో వెంకయ్యనాయుడు, వసంత నాగేశ్వరరావులతో ఆయన ఉద్యమంలో పాల్గొనడం విశేషం. ఆయనకు భార్య అన్నపూర్ణ కుమారుడు వాలిన వీరబాబు, కుమార్తె భారతి ఉన్నారు.

వాలిన సూర్య భాస్కరరావు మృతి పట్ల ఏఐసీసీ సభ్యులు మండపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కామన ప్రభాకర రావు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, వైఎస్సార్సీపీ మండపేట ఇన్చార్జి తోట త్రిమూర్తులు, ఏడిద సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అలీ ఖాన్ బాబా, వైఎస్ఆర్ సిపి లీగల్ అడ్వైజర్ , హై కోర్టున్యాయవాది టి వి గోవిందరావు, జిన్నూరి సాయిబాబా, మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ పలు నాయకులు సంతాపం తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.