దావోస్‌లో ఎపి సిఎం చంద్ర‌బాబు ప్ర‌సంగం

దావోస్‌ (CLiC2NEWS): ప్ర‌పంచ ఆర్దిక స‌ద‌స్సులో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల సిఎంలు దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. దావోస్‌లో ప్ర‌పంచ ఆర్దిక స‌ద‌స్సులో  భాగంగా నిర్వ‌హించిన సిఐఐ ఆధ్వ‌ర్యంలో గ్రీన్ ఇండ‌స్ట్రియ‌లైజేష‌న్‌పై ఎపి సిఎం చంద్ర‌బాబు మాట్లాడారు. ప్ర‌పంచ దేశాల‌కు భార‌తీయులు అత్యుత్త‌మ సేవ‌లు అందిస్తున్నార‌ని.. మీ అంద‌ర్నీ చూస్తుంటే నా భ‌విష్య‌త్తు క‌ల‌లు నిజ‌మ‌వుతాయ‌నే న‌మ్మ‌కం క‌లుగుతుంద‌న్నారు. భార‌తీయుల ర‌క్తంలోనే వ్యాపార ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని చంద్ర‌బాబు అన్నారు. ఎక్క‌డికి వెళ్లిన ఎపి పారిశ్రామిక వేత్త‌లే క‌నిపిస్తున్నార‌ని.. భార‌తీయులు అందిస్తున్న సేవ‌లప‌ట్ల గ‌ర్విస్తున్నాన‌న్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నాయ‌క‌త్వంలో భార‌త్‌లో స్థిర‌మైన ప్ర‌భుత్వం ఉంద‌ని చంద్ర‌బాబు అన్నారు.

ఎపిలో ఆర్గానిక్ వ్య‌వ‌సాయంపై దృష్టిసారించిన‌ట్లు చంద్ర‌బాబు తెలిపారు. గ్లోబ‌ల్ క‌మ్యూనిటికి ఎపి ఓ మోడ‌ల్ అవుతుంద‌ని.. గ్రీన్ ఎన‌ర్జి, గ్రీన్ హైడ్రోజ‌న్ ను ఉత్ప‌త్తి చేసేందుకు రాష్ట్రంలో ఉన్న అవ‌కాశాలు వినియోగించుకోవాల‌ని పారిశ్రామిక వేత్త‌ల‌ను కోరుతున్న‌ట్లు తెలిపారు.

ఈ సంద‌ర్బంగా ఎపిలో సిఐఐ కేంద్రం ఏర్పాటుపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎపి రాజ‌ధాని అమ‌రావ‌తిలో టాటా సంస్థ‌తో క‌లిసి సిఐఐ కేంద్రం ఏర్పాటు చేస్తామ‌ని వెల్ల‌డించారు. పెట్టుబ‌డులు ఆక‌ర్ష‌ణ‌, ఉపాధి క‌ల్ప‌న ల‌క్ష్యంగా సిఐఐ కేంద్రం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

రెండున్న‌ర ద‌శాబ్దాల్లో హైద‌రాబాద్ అభివృద్ధి చెందిన‌ద‌ని.. భార‌త్‌లో అత్యంత నివాస‌యోగ్య‌మైన న‌గ‌రంగా తీర్చిదిద్ద‌డంలో ఎంతో కృషి చేసిన‌ట్లు తెలిపారు. 25 సంవ‌త్స‌రాల కింద‌ట బిల్‌గేట్స్ ఐటి సేవ‌ల‌ను తెచ్చార‌ని.. దేశంలో తొలిసారి 1991 ఆర్ధిక సంస్క‌ర‌ణ‌లు ప్ర‌వేశ‌పెట్టార‌న్నారు. ఇంట‌ర్నెట్‌, ఆర్ధిక సంస్క‌ర‌ణ‌ల‌ను వినియోగించి రెండో త‌రం సంస్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌వేశ‌పెడితే.. ఎన్నిక‌ల్లో ఓడిపోవాల్సి వ‌చ్చింద‌న్నారు. ఇపుడు ఆ విధానాలే ప్ర‌జ‌ల‌కు అనుకూలంగా, అత్యుత్త‌మంగా మారాయ‌ని అన్నారు.

1999లో తొలిసారిగా విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు ప్రారంభ‌మ‌య్యాయని చంద్ర‌బాబు తెలిపారు. 2014లొ సిఎంగా ఉన్న‌పుడు సౌర విద్యుత్‌పై ఎక్కువ దృష్టి సారించామ‌న్నారు. ఎపి గ్రీన్ ఎన‌ర్జి, గ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్‌గా మారుతుంద‌ని.. 21 బిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డితో ఎన్‌టిపిసి-ఎపిజెన్‌కో సంయుక్తంగా గ్రీన్ హైడ్రోజ‌న్ ఉత్ప‌త్తి చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు. పిఎం సూర్య ఘ‌ర్ కింద ఇంటింటికీ సౌర విద్యుత్ ఉత్ప‌త్తిచేస్తే.. అత్యంత త‌క్కువ ఖ‌ర్చుతోనే విద్యుత్ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చేలా దృష్టి సారించామ‌ని సిఎం చంద్ర‌బాబు తెలిపారు..

 

Leave A Reply

Your email address will not be published.