AP Covid: ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సకు ఫీజులు ఫిక్స్!

అమ‌రావ‌తి (CLiC2NWS): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ రోగులకు చికిత్సలు అందించే ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం ఫీజులు నిర్ణయించింది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ప్రతినిధులు, యాజమాన్యాలతో చర్చించి ధరలు నిర్ధారించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.

ఈ క్రమంలోనే ఎన్ఏబీహెచ్ అక్రిడేషన్ ఉన్న ఆసుపత్రులకు ఒక ధర, అక్రిడేషన్ లేని హాస్పిటల్స్ కు మరో ధరను నిర్ణయించింది.

NABH అక్రిడేషన్ కలిగిన ఆసుపత్రులు నం క్రిటికల్ కేర్(ఆక్సిజన్ లేకుండా) కోసం రూ. 4000, అక్రిడేషన్ లేని ఆసుపత్రులు రూ. 3600 వసూలు చేయాలని ఆదేశించింది. కాగా, NABH అక్రిడేషన్ ఉన్న ఆసుపత్రులు, లేని ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స రేట్లు ఇలా ఉన్నాయి…

రోగికి సంబంధించి అన్నీ కలిపే పై ధరలు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. కన్సల్టేషన్, నర్సింగ్‌ చార్జీలు, రూమ్‌ అద్దె, భోజనం, కోవిడ్‌ టెస్టింగ్, రక్తపరీక్షలు, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ పరీక్షలు, పీపీఈ కిట్‌లు, మందులు, యూరినరీ ట్రాక్ట్‌ కేథటరైజేషన్‌ వంటివన్నీ ఇందులోనే ఉంటాయన్నారు.

NABH అక్రిడేషన్ ఉన్న ఆసుపత్రుల్లో రేట్లు ఇలా(రోజుకు)

  • నాన్ క్రిటికల్ కేర్ (ఆక్సిజన్ లేకుండా) – రూ. 4000
  • నాన్ క్రిటికల్ కేర్ (ఆక్సిజన్ తో) – రూ. 6500
  • ఐసీయూలో చికిత్స అందిస్తే – రూ. 12,000
  • క్రిటికల్ కేర్ (ఐసీయూ + వెంటిలేటర్) – రూ. 16,000

అక్రిడేషన్ లేని ఆసుపత్రుల్లో రేట్లు ఇలా(రోజుకు)…

  • నాన్ క్రిటికల్ కేర్ (ఆక్సిజన్ లేకుండా) – రూ. 3600
  • నాన్ క్రిటికల్ కేర్ (ఆక్సిజన్ తో) – రూ. 5850
  • ఐసీయూలో చికిత్స అందిస్తే – రూ. 10,800
  • క్రిటికల్ కేర్  (ఐసీయూ + వెంటిలేటర్) – రూ. 14,400

సీటీ స్కాన్‌కు రూ.3 వేలు
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ధరల్లోనే అన్ని ఫీజులు ఉంటాయని.. ఆసుపత్రులు కోవిడ్ రోగులను వెంటనే చేర్చుకోవాలని తెలిపింది. అలాగే కరోనా బాధితుల నుంచి ఎలాంటి అడ్వాన్స్ లు తీసుకోకూడదని స్పష్టం చేసింది. అలాగే సీటీ స్కాన్‌కు రూ.3 వేలకు మించి తీసుకోకూడదని ప్రభుత్వం పేర్కొంది. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌కు ఒక్కోదానికి రూ.2,500, తోసిజుమాంబ్‌ ఇంజక్షన్‌కు రూ.30 వేలు తీసుకోవచ్చు. ఇంతకుమించి ఏ ఆస్పత్రి ఎక్కువ వసూలు చేసినా వాటిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు, కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్, జిల్లా వైద్యాధికారులు, తదితరులకు కల్పించారు. తక్షణమే ఈ రేట్లు అమల్లోకి వస్తాయని, జిల్లా కలెక్టర్లు నిరంతరం వీటిని పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.