జీతం మొత్తాన్ని అనాథ బిడ్డల సంక్షేమం కోసం వినియోగిస్తా.. ఎపి డిప్యూటి సిఎం

మంగళగిరి (CLiC2NEWS): తన జీతం మొత్తాన్ని అనాథ బిడ్డల సంక్షేమానికి వినియోగించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్
ప్రకటించారు. శుక్రవారం పిఠాపురం నియోజక వర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున రూ.2,10,000 ఆర్ధిక సాయాన్ని అందించారు. మిగిలిన మొత్తాన్ని వారి బాగోగులు చూసేందుకే ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.
ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక వేతనం తీసుకోకూడదని నిర్ణయించుకున్నానని.. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్న భావనతోనే వేతనం తీసుకున్నా అన్నారు. పిఠాపురం ప్రజలు ఎంతో నమ్మకంతో ఎమ్మెల్యేగా తనని గెలిపించారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధితో పాటు సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అన్నారు. ఇక్కడి ప్రజలు ఇచ్చిన అధికారం ద్వారా వచ్చిన వేతనాన్ని ఇక్కడే వినియోగించాలని నిర్ణయించుకున్నానన్నారు. వేతనం రూపంలో తీసుకున్న మొత్తాన్ని పిఠాపురం నియోజకవర్గం పరిధిలో కన్నవారు దూరమైన పిల్లల భవిష్యత్తు కోసం, వారి చదువులకు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పదవి ఉన్నంత కాలం వచ్చే జీతం ఆ బిడ్ల సంక్షేమానికి వినియోగిస్తానని డిప్యూటి సిఎం ప్రకటించారు.