లంచం అడిగితే యాప్ ద్వారా ఫిర్యాదు చేయండి: జగన్
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవినీతి నిరోధానికి ‘ఎసిబి 14400’ మొబైల్ యాప్ను బుధవారం ప్రారంభించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిరోధించడమే లక్ష్యంగా ఎపి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరక అవినీతి నిరోధక శాఖ (అనిశా) కొత్తగా మొబైల్ యాప్ను అందుబాలోకి తెచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ యాప్ను ప్రారంభించారు. ‘ఎసిబి 14400’ పేరుతో మొబైల్ యాప్ను అవినీతి నిరోధకశాఖ రూపిందించింది.
ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విభాగాల్లో ఎక్కడైనా లంచం అడిగితే ఎవరైనా యాప్ ద్వారా ఫిర్యాదు పంపవచ్చని సిఎం తెలిపారు. ఫిర్యదుకు తమ దగ్గరున్న డాక్యుమెంట్లను వీడియో, ఆడియో,ఫొటో ఆధారాలను ఎసిబికి పంపించే అవకాశం ఉందన్నారు. ఫిర్యాదు రిజిస్టర్ చేయగానే మొబైల్కు రిఫరెన్స్ నంబరు వస్తుంది. అవినీతిని నిరోధించడానికి మరో విప్లవాత్మక మార్పును తీసుకువస్తున్నామన్నారు. ఫిర్యాదులను ఎసిబి నేరుగా సిఎంఓకు నివేదిస్తుందని తెలిపారు. అవినీతి లేని పాలన అందించడం మన అందరి కర్తవ్యమని, ఎవరైనా పట్టుబడితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని సిఎం స్పష్టం చేశారు.