దర్శకుడు ఆర్జీవీ ఇంటికి చేరుకున్న ఏపీ పోలీసులు!
హైదరాబాద్ (CLiC2NEWS): దర్శకుడు రాంగోల్‌వర్మ ఇంటికి ఎపి పోలీసులు చేరుకున్నారు. సోమవారం ఆయన ఒంగోలు రూరల్ పిఎస్‌లో విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. రాకపోవడంతో అరెస్టు చేసేందుకు వచ్చినట్లు సమాచారం. ఎపి అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు , పవన్‌కల్యాణ్ లపై సామాజిక మాధ్యమం వేదికగా పోస్టులు పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టిడిపి ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆర్‌జివిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆర్జివి హైకోర్టును ఆశ్రయించారు. అయితే, అరెస్ట్ నుండి రక్షణ కల్పించలేమని ఎపి ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ నెల 19వ తేదీన వర్మ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. 4 రోజుల సమయం కావాలని ఒంగోలు పోలీసులకు వాట్సాప్‌లో సమాచారం పంపారు. అనంతరం 25న విచారణకు హాజరుకావాలని అర్జివికి నోటీసులు పంపారు. ఆయన విచారణకు రాకపోవడంతో అరెస్టుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సినిమా పనుల్లో భాగంగా అర్జివి వేరే ప్రాంతంలో ఉన్నారని, కొద్దిరోజుల సమయం కావాలని పోలీసులను కోరినట్లు ఆర్జివి తరపు న్యాయవాది తెలిపారు. వర్చువల్‌గా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి కోరినట్లు సమాచారం.