ఎపి రాజ్య‌స‌భ ఉప ఎన్నిక‌ల షెడ్యూల్

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ్య‌స‌భ ఉపఎన్నిక‌ల‌కు మంగ‌ళ‌వారం షెడ్యూల్ విడుద‌లైంది. ముగ్గురు వైఎస్ ఆర్‌సిపి రాజ్యస‌భ స‌భ్యులు రాజీనామాతో ఖాళీ అయిన స్థానాల‌కు ఉపఎన్నిక జ‌ర‌గ‌నున్నాయి. బీద మ‌స్తాన్‌రావు, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, ఆర్‌.కృష్ణ‌య్య రాజీనామాల‌తో ఉప ఎన్నిక ఖ‌రారైంది. 2019 అధికారంలో ఉన్న వైఎస్ ఆర్‌సిపి రాజ్య‌స‌భ‌లో 2020, 2022, 2024 వ‌రుస‌గా మొత్తం 11 స్థానాలను కైవ‌సం చేసుకుంది. ఒక రాజ్య‌స‌భ అభ్య‌ర్థి విజ‌యం సాధించాలంటే కనీసం 25 మంది ఎమ్మెల్యేల మ‌ద్దతు అవ‌స‌రం. ప్ర‌స్తుతం వైఎస్ ఆర్‌సిపిలో 11 ఎమ్మెల్యేలు ఉండ‌టంతో ఆ పార్టి రాజ్య‌స‌భ బ‌రిలో నిలిచేందుకు అవ‌కాశం లేదు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆపార్టి కేవ‌లం 11 స్థానాలు మాత్ర‌మే గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో 3 రాజ్య‌స‌భ స్థానాల‌ను కూట‌మి కైవ‌సం చేసుకుంది. అయితే 3 స్థానాల్లో టిడిపి తీసుకుంటుందా.. బిజెపి ,జ‌న‌సేన‌కు అవ‌కాశం ఇస్తుందా.. అని స‌ర్వ‌త్రా చ‌ర్చ మొద‌లైంది.

ఎపితో స‌హా నాలు రాష్ట్రాల‌లో రాజ్య‌స‌భ ఉప ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఇసి) షెడ్యూల్ విడుద‌ల చేసింది. డిసెంబ‌ర్ 3వ తేదీన నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. డిసెంబ‌ర్ 10 వ‌ర‌కు నామినేష‌న్లు స్వీక‌ర‌ణ‌కు గ‌డువు ఉంటుంది. 11వ తేదీనుండి నామినేష‌న్ల ప‌రిశీల‌న‌, 13 వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు అవ‌కాశం ఉంటుంది. డిసెంబ‌ర్ 20న ఉద‌యం 9 గంట‌ల నుండి సాయంత్ర 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ నిర్వ‌హిస్తారు.

Leave A Reply

Your email address will not be published.