పెంపుడు జంతువులను వదిలి రాలేనంటున్న ఎపి వాసి
ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ఉన్నభారతీయులంతా స్వదేశానికి చేరుకుంటున్నారు. భారత ప్రభుత్వం అపరేషన్ గంగ పేరుతో ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తుంది. అయతే, ఎపికి చెందిన వ్యక్తి మాత్రం తన పెంపుడు జంతువులను వదిలి రాలేనంటున్నాడు. తన ప్రాణాల కోసం వాటిని వదిలేయలేనని అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా, తణుకుకు చెందిన గిరికుమార్ పాటిల్ మెడిసిన్ చదివేందుకు ఉక్రెయిన్ వెళ్లాడు. అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను జాగ్వార్‌ను, బ్లాక్ పాంథర్, మరో నాలుగు కుక్కలను పెంచుతున్నాడు.
ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలైనప్పటినుండి తన ఇంటి కింద ఉన్న బేస్‌మెంట్‌లోనే ప్రస్తుతం కాలం గడుపుతున్నాడు. జంతువులకు ఆహారం కోసం బయటకు వస్తున్నాడు. వాటిని వదిలి రాలేను అంటున్నాడు. బాంబుల శబ్ధాలకు జంతువులు భయపడుతున్నాయని , సరిగా తినడం లేదు. వాటిని ఎలా వదిలేయాలి అని అంటున్నాడు. ఈనేపథ్యంలో తన పెంపుడు జంతువులను కూడా భారత్‌కు తరలించేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందని ఆశిస్తున్నాడు.