AP-TS: బోర్డర్ లో నిలిచిపోయిన 20 అంబులెన్స్‌లు

క‌ర్నూలు (CLiC2NEWS): ఎపి-తెలంగాణ స‌రిహ‌ద్దుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన అంబులెన్సుల‌ను తెలంగాణ పోలీసులు మ‌ళ్లీ నిలిపివేస్తున్నారు. దీంతో క‌ర్నూలు జిల్లా స‌రిహ‌ద్దులోని పుల్లూరు చెక్పోస్టు వ‌ద్ద అర్థ‌రాత్రి త‌ర్వాత నుంచి పెద్ద ఎత్తున అంబులెన్సులు నిలిచిపోయాయి.

తెలంగాణ పొరుగు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు అధికంగా ఉండ‌టంతో తెలంగాణ ప్ర‌భుత్వం అప్ర‌మత్తం అయ్యి లాక్‌డౌన్‌ను విధించింది. రాష్ట్ర స‌రిహ‌ద్దు వద్ద భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేసింది ప్ర‌భుత్వం. బోర్డ‌ర్ వ‌ద్ద ఏపీ నుంచి వ‌చ్చే అంబులెన్స్ ల‌ను హైద‌రాబాద్ కు వెళ్లేందుకు పోలీసులు నిరాక‌రిస్తున్నారు. దీంతో క‌ర్నూలు జిల్లాలోని పుల్లూరు చెక్ పోస్ట్ వ‌ద్ద ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లు పెద్ద సంఖ్య‌లో బారులు తీరాయి.

హైద‌రాబాద్‌లోని ఆస్ప‌త్రుల నుంచి బెడ్ అనుమ‌తి ప‌త్రం, తెలంగాణ మంజూరు చేసిన ఈ పాస్ ఉంటేనే అనుమ‌తి ఇస్తామ‌ని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు అడ్డుకోవ‌డంతో సుమారు 20 అంబులెన్స్‌లు పుల్లూరు చెక్‌పోస్టు వ‌ద్ద నిలిచిపోయాయి.

అలాగే సూర్యాపేట జిల్లా రామాపురం వ‌ద్ద కూడా ఎపి అంబులెన్స్‌ల‌ను నిలిపివేస్తున్నారు. కాగా రోగుల‌తో వ‌స్తున్న అంబులెన్సుల‌ను నిలిపివేయ‌డంతో వారి బంధువులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్త‌న్నారు.అనుమ‌తులు ఉన్నా ఆపేస్తున్నార‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు.

అంబులెన్స్ ల‌కు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో.. ఈ విష‌యం తెలుసుకున్న క‌ర్నూలు ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్ పుల్లూరు చెక్‌పోస్టు వ‌ద్ద‌కు చేరుకున్నారు. తెలంగాణపోలీసు ఉన్న‌తాధికారుల‌తో ఆయ‌న ఫోన్‌లో మాట్లాడారు. కాగా బెడ్ల ఖాళీగా ఉన్న‌ట్లు అనుమ‌తి, ఈ-పాస్ ఉన్న‌వారిని విడిచిపెడుతున్నామ‌ని ఎమ్మ‌ల్యేకు అధ‌కారులు స్ప‌ష్టం చేశారు. దీంతో అన‌మ‌తులున్న ఉన్నాకే హైద‌రాబాద్ బ‌య‌లుదేరాల‌ని రోగుల బంధువుల‌కు ఎమ్మెల్యే సూచించారు. ఈ స‌మ‌స్య‌పై ఏపీ చీఫ్ సెక్ర‌ట‌రీకి వివ‌రిస్తామని ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్ పేర్కొన్నారు. ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌వారిని క‌ర్నూలు ప్ర‌భుత్వాసుప‌త్రికి పంపించారు.

Leave A Reply

Your email address will not be published.