దేవాలయ భూములు ఆక్రమణ చేస్తే పిడి యాక్ట్ .. మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్ (CLiC2NEWS): దేవాలయ భూములను కబ్జా చేస్తే పిడి యాక్ట్ పెడతామని దేవాదయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. భద్రాచలం ఆలయ భూముల ఆక్రమణ విషయంలో మంగళవారం ఇఒ రమాదేవిపై గ్రామస్థుల దాడి చేశారు. ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. ఆలయ ఇఒలపై దాడి చేస్తే ఊరుకునేది లేదని.. దేవాలయ భూములను కబ్జా చేస్తే పిడియాక్ట్ పెడతామన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఎపి సిఎం చంద్రబాబును మత్రి కోరారు.
ఎపిలోని పురషోత్తపట్నంలో భద్రాచలం ఆలయానికి చెందిన భూములను గ్రామస్థులు ఆక్రమించుకున్నారు. కోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేసి నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో ఆలయ భూ ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఇఒపై దాడికి పాల్పడ్డారు. ఆమె స్పృహ కోల్పోయారు. ఇఒ రమాదేవితో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి వినీల్ కూడా అస్వస్థతకు గురయ్యారు. అతడికి కూడా చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆలయ ఇఒపై దాడిని ఖండించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న రమాదేవిని పరామర్శించారు. దాడి చేసిన వారిపై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎపిలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో భద్రాచలం రామాలయానికి చెందిన 889 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి చాలాకాలంగా ఆక్రమణలకు గురి అయింది. ఈ విషయంలో ఎపి హైకోర్టు దేవస్థానానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దేవస్తానానికి ఈ భూములకు సంబంధించిన పాసు పుస్తకాలు కూడా ఉన్నట్లు సమాచారం.