ఎమర్జెన్సీ దిశగా బిజెపి వెళ్తోంది: కేజ్రీవాల్‌కు సిఎం కెసిఆర్ మద్దతు
హైదరాబాద్ (CLiC2NEWS): కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సర్కార్‌పై సిఎం కెసిఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర సర్కార్ ఆగడాలు, అరాచకాలు మితిమీరిపోతున్నాయని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. శనివారం సిఎం కెసిఆర్‌తో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్‌మాన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. “ ఢిల్లీలో రెండు జాతీయ పార్టీలను మట్టి కరిపించి కేజ్రీవాల్ అద్భుత విజయం సా్ధించారు. ఢిల్లీ ప్రజా ప్రభుత్వాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోంది. అక్కడ అధికారుల బదిలీ, పోస్టింగులపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకు రావడాన్ని సుప్రీం కోర్టు కూడా తప్పు పట్టింది. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వానికే అధికారులు ఉంటాయని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పింది. సుప్రీం తీర్పును దిక్కరిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చింది. ఇందిరా గాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీ దిశగా కేంద్రంలో ని బిజెపి వెళ్తోంది. ఎమర్జెన్సీని వ్యతిరేకిందే నేతలు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారు. “ అని సిఎం కెసిఆర్ అన్నారు.
ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి సర్కార్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అన్నారు. ఢిల్లీ ప్రజలను మోడీ సర్కార్ తీవ్రంగా అవమానిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశంలోని పార్టీలు అన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు.
పంజాబ్ సిఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గవర్నర్ వ్వవస్థను మోడీ సర్కార్ పూర్తిగా దుర్వినియోగం చేస్తోందని మండి పడ్డారు.