కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో పేలుళ్లు..
సుమారు 2,500 మంది ఒకే చోట ప్రార్థనలు..

ఎర్నాకులం (CLiC2NEWS): కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రార్థనలు జరుగుతుండగా ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 23 మంది గాయపడినట్లు సమాచారం. కేరళలోని కాలామస్సేరి నెస్ట్ సమీపంలోని జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ హాలులో ఆదివారం ఉదయం దాదాపు 2,500 మంది ఈ ప్రార్థనలలో పాల్గొన్నారు. చుట్టుప్రక్కల ఉన్న వరపుజ, అంగమలి, ఎడపల్లి నుంచి భారీగా జనం వచ్చినట్లు తెలుస్తుంది. ప్రార్థన సమయంలో వీరంతా కళ్లు మూసుకొని ఉండగా పేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అనంతరం రెండు, మూడు పేలుళ్లు జరిగినట్లు వెల్లడించారు. కన్వెన్షన్ లోపలి వైపు నుండి తాళం వేసి ఉండటంతో గాయపడిన వారిని తరలించడంలో జాప్యం చోటు చేసుకుందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందిస్తూ.. ఇది దురదృష్టకరమైన ఘటన అని.. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. దీనిపై పూర్తి వివరాలు సేకరిస్తామన్నారు. క్షతగాత్రులలో 10 మంది 50 శాతం కంటే ఎక్కువ కాలిన గాయాలతో చికిత్స తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే, ద్వేషపూరిత మెసేజ్‌లు వ్యాప్తి చేయోద్దని.. ఆవిధంగా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలోని 14 జిల్లాల్లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో భద్రతను పెంచినట్లు సమాచారం.
[…] కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌ల… […]