అభిమానులకు క్షమాపణలు చెప్పిన అక్షయ్‌కుమార్
ముంబయి (CLiC2NEWS): బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. సినీ హీరోలు, హీరోయిన్లు ఎం త బిజీగా ఉన్న అప్పుడప్పుడు వాణిజ్య ప్రకటనల్లోనూ యాక్ట్ చేస్తుంటారనే విషయం అందరికీ తెలిసినదే. యువత భవిష్యత్తును నాశనం చేసే ధూమపానం, మద్యపానం వంటి ప్రకటనలు తాను చేయనని గతంలో అక్షయ్ చెప్పారు. అయతే, ఇటీవల అజయ్‌దేవగణ్, షారుఖ్‌ఖాన్‌లతో కలిసి ఓ పొగాకు బ్రాండ్ వాణిజ్య ప్రకటనలో అక్షయ్ నటించారు. ఈ ప్రకటన గత కొన్ని రోజులుగా ప్రసారం అవుతోంది. అది చూసిన అక్షయ్ అభిమానులు, నెటిజన్లు అసహనానికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకతను తెలియజేశారు. వెంటనే సదరు కమర్షియల్ యాడ్ నుంచి తప్పుకోవాలని కోరారు.
ఈసందర్భంగా అక్షయ్‌కుమార్ తన అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. “తనపై ప్రేమాభిమానాలు చూసిస్తున్న ప్రతిఒక్కరికీ నా క్షమాపణలు. గత కొన్ని రోజులుగా మీనుంచి వస్తోన్న ప్రతికూల స్పందన నన్నెంతగానో కలచివేసింది. నేనెప్పటికి పొగాకు వ్యతిరేకినే. మీ అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని ఆ యాడ్ నుంచి తప్పుకొంటున్నాను. అలాగే ఆయాడ్ కోసం నాకు లభించిన మొత్తాన్ని ఓ మంచి పని కోసం ఉపయోగించాలనుకుంటున్నా. కాంట్రాక్ట్ ఉన్న కారణంగా న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ యాడ్ ప్రసారం అవుతూనే ఉంటుంది. ఒక భవిష్యత్తులో ప్రతి విషయంపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని మీకు మాటిస్తున్నా” అని అక్షయ్ వివరించారు.