కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై

బెంగళూరు (CLiC2NEWS): కర్ణాటక రాష్ట్రంలో యడ్యూరప్ప రాజీనామాతో కొత్త నాయకుడు ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఈ మేరకు కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైని భారతీయ జనతాపార్టీ ఖరారు చేసింది. కన్నడ నాట అత్యధిక ఓటర్ల ప్రాబల్యం కలిగిన లింగాయత్ సామాజిక వర్గానికే మళ్లీ ముఖ్యమంత్రి పిఠాన్ని అప్పగిస్తూ కమలనాథులు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం బెంగళూరులో జరిగిన కర్ణాటక బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆయనను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.
కేంద్రమంత్రులు మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జీ కిషన్‌రెడ్డి సమక్షంలో ఈ కొత్త ముఖ్యమంత్రి ని ఎన్నుకున్నారు. బసవరాజు బొమ్మై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు.
మరోవైపు కొత్త సిఎం రేసులో రాష్ట్ర గనుల శాఖ మంత్రి మురేశ్ నిరానీ, ఎమ్మెల్యే అరవింద్ గెల్లాట్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సిటీ రవి, డిప్యూటీ సిఎం అశ్వథ్ నారాయణ్, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, ప్రభుత్వ చీప్ విప్ సునీల్ కుమార్ తదితర కీలక నేతల పేర్లు ప్రధానంగాగా వినవచ్చాయి. కానీ స్థానిక పరిస్థితుల దృష్ట్యా బొమ్మై వైపే బిజెపి అధిష్టానం మొగ్గు చూపింది.
బొమ్మై రాజకీయ ప్రస్థానం..
బసవరాజు బొమ్మై రాజకీయ ప్రస్థానం 1998లో జనతాదల్ పార్టీలో చేరడంతో ప్రారంభమైంది. ఆయన 1998, 2004లో జనతాదల్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తర్వాత 2008లో బీజేపీలో చేరారు. ఇప్పటివరకు ఆయన యెడియూరప్ప మంత్రి వర్గంలో హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఈ రోజు జరిగిన బీజేఎల్పీ సమావేశంలో సభా నాయకుడిగా ఎన్నికయ్యారు.