క‌ర్ణాట‌క సిఎంగా బ‌స‌వ‌రాజు బొమ్మై ప్ర‌మాణ‌స్వీకారం

బెంగళూరు (CLiC2NEWS): క‌ర్ణాట‌క‌ ముఖ్య‌మంత్రిగా బ‌స‌వ‌రాజు బొమ్మై ప్ర‌మాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని రాజ్‌భ‌వ‌న్‌లో బుధ‌వారం ఆయ‌న రాష్ట్ర 20వ సీఎంగా ప్రమాణ‌స్వీకారం చేశారు. య‌డ్యూర‌ప్ప స‌ర్కార్‌లో బొమ్మై హోంమంత్రిగా పనిచేశారు. య‌డ్యూర‌ప్ప‌లాగే బొమ్మై కూడా రాష్ట్రంలో రాజకీయ ప్రాబల్యం కలిగిన లింగాయత్‌ వర్గానికి చెందినవారు. శాసనసభా పక్ష సమావేశంలో బొమ్మై పేరును యెడియూరప్ప ప్రతిపాదించగా పలువురు బలపరిచారు. కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్.. బొమ్మైతో ప్ర‌మాణ స్వీకారం చేయించారు.

ముగ్గురు ఉప‌ముఖ్య‌మంత్రుల‌ను కూడా నియ‌మించారు. ఆర్‌. అశోక్‌, బి.శ్రీ‌రాములు, గోవింద కారజోళ ఈ ప‌ద‌వుల‌కు ఎంపిక‌య్యారు.

బసవరాజ్‌ బొమ్మై మాజీ సిఎం యడ్యూర‌ప్ప‌కు అత్యంత నమ్మకస్తుడు. మెకానికల్‌ ఇంజనీర్‌ అయిన బొమ్మై పుణెలోని టాటా గ్రూపులో తన కెరీర్‌ను ప్రారంభించారు. తర్వాత జనతాదళ్‌ (ఎస్‌)తో రాజకీయాల్లోకి ప్రవేశించారు.

బొమ్మై రాజ‌కీయ ప్ర‌స్థానం..

బ‌స‌వ‌రాజు బొమ్మై రాజ‌కీయ ప్ర‌స్థానం 1998లో జ‌న‌తాద‌ల్ పార్టీలో చేర‌డంతో ప్రారంభ‌మైంది. ఆయ‌న 1998, 2004లో జ‌న‌తాద‌ల్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. త‌ర్వాత 2008లో బీజేపీలో చేరారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న యెడియూర‌ప్ప మంత్రి వ‌ర్గంలో హోంశాఖ మంత్రిగా ఉన్నారు. ఈ రోజు జ‌రిగిన బీజేఎల్పీ స‌మావేశంలో స‌భా నాయ‌కుడిగా ఎన్నిక‌య్యారు.

Leave A Reply

Your email address will not be published.