ఉక్రెయిన్‌తో యుద్ధపరిష్కారానికి ‘బ్రిక్స్’ సరైన వేదిక కావచ్చు: రష్యా రాయబారి
ఢిల్లీ (CLiC2NEWS): ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య మొదలైన యుద్ధం వెయ్యి రోజులు కావొస్తుంది. 2022 ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం ఇరుదేశాలకు ఆస్థి, ప్రాణ నష్టాన్ని కలిగించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఉక్రెయిన్ సైనికులు 80 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోవటమే కాక, దాదాపు 4లక్షల మంది గాయపడ్డారు. అదేవిధంగా దాదాపు 2 లక్షల మంది మాస్కో సైనికులు సైతం మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
భారత్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో రష్యా రాయబారి దెనిస్ అలిపోవ్ పాల్గొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై మంగళవారంతో 1000వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రష్యారాయబారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో చర్చల విషయంలో ప్రస్తుతం సరైన పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ఇరుదేశాల మధ్య చర్చలు జరగాలంటే ఉక్రెయిన్‌లో ఉన్న రష్యన్ మూలాలు గల పౌరులకు భద్రత కల్పించాలని సూచించారు. మాస్కో చర్చలకు సిద్ధంగా ఉందన్న ఆయన.. ఉక్రెయిన్‌తో యుద్ధపరిష్కారానికి ‘బ్రిక్స్’ సరైన వేదిక కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించే సామర్ధ్యం ‘బ్రిక్స్’ దేశాలకు ఉందని నమ్ముతున్నట్లు తెలిపారు.