ఛత్తీస్‌గఢ్‌లో చేతబడి నెపంతో ఐదుగురి దారుణ హత్య

సుక్మా (CLiC2NEWS): ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతున్నా.. సాంకేతికంగా కొత్త పుంతలు తొక్కుతున్నా కొందరు మాత్రం అంధవిశ్వాసాలతో కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని కుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇట్కల్‌లో చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో గ్రామస్థులు ఐదుగురిని హత్య చేశారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. చేతబడి వల్ల తమ కుటుంబాల్లో వ్యక్తులు అనారోగ్యానికి గురయ్యారని, అందుకే వారిని హత్య చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసుపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.