తెలంగాణ‌లో సాగునీటి ప్రాజెక్టుల‌కు క్యాబినేట్ ఆమోదం..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ప‌లు సాగునీటి ప్రాజెక్టుల‌కు రాష్ట్ర మంత్రి మండ‌లి ఆమోదముద్ర వేసింది. తెలంగాణ భ‌వ‌న్‌లో ఈరోజు క్యాబినేట్ భేటీ జ‌రిగింది. కెసిఆర్ అధ్య‌క్ష‌త‌న‌ మంత్రిమండ‌లి ఇరిగేష‌న్ శాఖ‌పై సుదీర్ఘ చ‌ర్చ‌ల అనంత‌రం ప‌లు అంశాల‌కు ఆమోదం తెలిపింది.

సిద్ధిపేట జిల్లాలో మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ నుండి త‌పాస్‌ప‌ల్లి జ‌లాశ‌యానికి లింక్ కాలువ తవ్వ‌కానికి రూ. 388.20 కోట్ల‌కు ఆమోదం తెలిపింది. దీనిద్వారా 1,29,630 ఎక‌రాల‌కు సాగునీరు అంద‌నుంది.

వ‌న‌ప‌ర్తి జిల్లాలో గోపాల్‌పేట మండ‌లం బుద్దారం గ్రామంలో ఉన్న‌పెద్ద చెరువు పున‌రుద్ద‌ర‌ణ ప‌నుల‌కు రూ. 44.71 కోట్లకు ఆయోదం తెలిపింది.

మ‌హాత్మాగాంధీ క‌ల్వ‌రుర్తి ఎత్తిపోత‌ల ప‌త‌కంలో భాగంగా నిర్మించ త‌ల‌పెట్టిన ఘ‌న్‌పూర్ కాలువ ప‌నుల‌కు రూ. 144.43 కోట్ల‌కు రాష్ట్ర మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఘ‌న్‌పూర్‌, అడ్డాకుల మండ‌లాల్లో 25,000 ఎక‌రాల‌కు సాగునీరంద‌నుంది.

ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగా న‌దిపై నిర్మాణం అవుతున్న చ‌న‌కా రోరాటా బ్యారేజికి సంబంధించి రూ.795.94 కోట్ల అంచ‌నా వ్యయాన్ని స‌వ‌రించేందుకు అమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో ఇప్ప‌టివ‌ర‌కు బ్యారేజి నిర్మాణం పూర్త‌యింది. పంప్‌హౌస్ నిర్మాణం కొన‌సాగుతుంది. దీని ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని 50,000 ఎక‌రాల‌కు సాగునీరు అంద‌నుంది.

మెద‌క్ జిల్లాలోని ఘ‌న్‌పూర్ ఆన‌క‌ట్ట ఆధునీక‌ర‌ణలో భాగంగా మిగిలిన ప‌నుల‌ను చేప‌ట్టేందుకు రూ. 50.32 కోట్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా మెద‌క్ జిల్లాలో దాదాపు 25 వేల ఎక‌రాల‌కు సాగునీరు అందుతుంది.

వ‌న‌ప‌ర్తి,గ‌ద్వాల జిల్లాల్లో 11 చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి రూ. 27.36 కోట్ల ప‌రిపాల‌నా అనుమ‌తుల‌కు క్యాబినేట్ ఆమోద‌ముద్ర‌ వేసింది.

వ‌న‌ప‌ర్తి జిల్లాలోని పెద్ద‌మంద‌డి మండ‌లం వెల్టూరు గ్రామంలో ఉన్న‌టువంటి గోపాల స‌ముద్రం చెరువు పున‌రుద్ద‌ర‌ణ నిమిత్తం రూ. 10.01 కోట్లు మంజూరు చేసింది.

గ‌ద్వాల జిల్లాలోని న‌ల‌సోమ‌నాద్రి గ‌ట్లుఎత్తి పోత‌ల ప‌థ‌కానికి స‌వ‌రించిన అంచ‌నా వ్యయం రూ 6.69 కోట్ల‌కు అనుమ‌తినిచ్చింది.

సూర్యాపేట జిల్లాలో వెల్ల‌టూరు గ్రామంలో ముక్త్యాల బ్రాంచ్ కాలువ నుండి ఎత్తిపోత‌ల నిర్మాణ ప‌థ‌కానికి , పాల్కేడ్ మండ‌లం, గుండెబోయిన గూడెం గ్రామంలో జాన్ ప‌హాడ్ బ్రాంచ్ కాలువ నుండి నిర్మించ త‌ల‌పెట్టిన ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు క‌లిపి రూ. 16.23 కోట్ల‌కు క్యాబినేట్ ఆమోదం తెలిపింది.

Telangana: రాష్ట్ర మంత్రి మండ‌లి ప‌లు కీల‌క నిర్ణ‌యాలు..

 

Leave A Reply

Your email address will not be published.