అవకతవకలపై ప్రశ్నిస్తే పరువ నష్టం దావా వేస్తారా..?: గురువారెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నించినందుకు తమపై అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ పరువు నష్టం దావా వేశారని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. విచారణలో భాగంగా శుక్రవారం నాంపల్లి కోర్టుకు ఆయన హాజరయ్యారు.
అనంతరం మీడియాతో గురువారెడ్డి మాట్లాడుతూ.. రూ.2కోట్లకు తమపై అజహరుద్దీన్ సివిల్ సూట్ వేశారని.. ఫేస్బుక్లో ఆరోపణలు చేసినందుకు పరువు నష్టం దావా వేశారని చెప్పారు.
అజహర్‌పై ఉన్న మ్యాచ్‌ఫిక్సింగ్ కేసులను మళ్లీ రీఓపెన్ చేయాలని.. సీబీఐతో విచారణ జరిపించాలని గురువారెడ్డి డిమాండ్ చేశారు. అజహర్ వేసిన పరువునష్టం దావాపై తాము కౌంటర్ వేశామని.. ఇప్పటి వరకు ఆయన నుంచి సమాధానం రాలేదన్నారు. బీసీసీఐ ఆదేశాలను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా చెప్పుకొంటున్న అజహరుద్దీన్ పాటించడం లేదని గురువారెడ్డి ఆరోపించారు.