రైళ్ల‌లో సీనియ‌ర్ సిటిజ‌న్ల రాయితీకి మంగ‌ళం!

సామాన్యుల‌కు మ‌రో షాక్ ఇచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ (CLiC2NEWS): ఢిల్లీలోని కేంద్ర స‌ర్కార్ సామాన్యుడికి మ‌రో షాక్ ఇచ్చింది. రైల్వే టికెట్ ధ‌ర‌పై వృద్ధుల‌కు ఇచ్చే రాయితీని పున‌రుద్ధ‌రించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. కొవిడ్ మ‌హమ్మారి నేప‌థ్యంలో అన్ని రాయితీల‌ను ర‌ద్దు చేసిన రైల్వే శాఖ.. కొన్నింటిని మాత్ర‌మే పున‌రుద్ద‌రించింది. గ‌త కొంత కాలంగా దేశ‌వ్యాప్తంగా వృద్ధుల‌కు ఇచ్చే రాయితీల‌ను పున‌రుద్ధ‌రించాల‌నే డిమాండ్ ప్ర‌యాణికుల‌నుంచి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.
టికెట్ రాయితీ గురించి అడిని ఓ ప్ర‌శ్న‌కు రైల్వే శాఖ మంత్రి అశ్వ‌నీ వైష్ణ‌వ్ బుధ‌వారం లిఖిత‌పూర్వ‌క స‌మాధానం ఇచ్చారు. గ‌తంలో ఇచ్చిన రాయితీల‌ను పున‌రుద్ధరించే యోచ‌న లేద‌ని స్పం చేశారు. ఈ రాయితీల వ‌ల్ల రైల్వే శాఖ‌పై మోయ‌లేని భారం ప‌డుతోంద‌ని పేర్కొన్నారు.

“కొవిడ్ మూలంగా 2019-20తో పోలిస్తే ప్ర‌యాణికుల నుంచి వ‌చ్చే ఆదాయం భారీగా త‌గ్గింది. ఇది దీర్ఘ‌కాలంలో రైల్వే శాఖ‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది. ఈ క్ర‌మంలో రాయితీల‌ను అనుమ‌తిస్తే రైల్వే శాఖ‌పై మ‌రింత భారం ప‌డుతుంది. కాబ‌ట్టి మున‌ప‌టిలా సీనియ‌ర్ సిటిజ‌న్లు స‌హా అన్ని కేట‌గిరీల వారికి రాయితీ పున‌రుద్ధ‌ర‌ణ అనే ఆశించ‌డం స‌రికాదు“ అని పేర్కొన్నారు.

రైలు ప్ర‌యాణాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 50 యేళ్ల వ‌య‌సు పైబ‌డిన మ‌హిళ‌ల‌కు 50 శాతం రాయితీ, అలాగే 60 ఏళ్ల వ‌య‌సు పైబ‌డిన పురుషుల‌కు మాత్రం 40 శాతం రాయితీని రైల్వే శాఖ అందిస్తోంది. మొత్తంగా 53 ర‌కాల రాయితీల‌నుక‌ల్పిస్తున్న రైల్వే శాఖ‌కు ఏటా దాదాపు 2 వేల కోట్ల భారం ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. వీటిలో సీనియ‌ర్ సిటీ జ‌న్ల రాయితీల వ‌ల్లే ఎక్కువ భారం ప‌డుతున్న‌ట్లు నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి.

కాగా గ‌డిచిన రెండు సంవ‌త్స‌రాల‌లో సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు నిలిపివేసిన రాయితీ కార‌ణంగా రైల్వే శాఖ దాదాపు రూ. 1500 కోట్ల అద‌న‌పు ఆదాయాన్ని పొందిన‌ట్లు తేలింది. స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు చెందిన ఓ వ్య‌క్తి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు రైల్వే శాఖ ఈ వివ‌రాలు వెల్ల‌డించింది.

Leave A Reply

Your email address will not be published.