ప్రిలిమ్స్ రద్దు సబబే
గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించాలన్న సింగిల్ జడ్జి నిర్ణయం సమర్థనీయమే.
![](https://clic2news.com/wp-content/uploads/2023/09/group-1-high-court-of-TS.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించాలన్న సింగిల్ జడ్జి నిర్ణయం సమర్థనీయమే అని హైకోర్టు స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ టిఎస్‌పిఎస్ సి దాఖలు చేసిన అప్పీలును అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ మేరకు బుధవారం జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ అనిల్ కుమార్ ల ధర్మాసనం విచారణ జరిపింది. గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంతో పరీక్షను తిరిగి నిర్వహించినప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది అని.. అలాంటి జాగ్రత్తలు ఏవీ తీసుకోలేదని కోర్టు వ్యాఖ్యానించింది. మొత్తం 504 పోస్టుల్లో పది నుంచి 15 మంది అనర్హులు చేరినా పరీక్ష నిర్వహణ లక్ష్యం దెబ్బతిన్నట్లేనని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు మంగళవారం కోర్టు అడిగిన సమాచారాన్ని కమిషన్ తరఫున అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ సమర్పించారు.
అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. పరీక్షను పారదర్శకంగా నిర్వహించామని, ఒక్క ఆరోపణ కూడా లేదని కోర్టు కు తెలిపారు. కేవలం ముగ్గురు పిటిషనర్లు మాత్రమే ఊహాజనిత అంశాలతో కోర్టుకు వచ్చారని తెలిపారు.
దాంతో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. “ఒక వేళ బయోమెట్రిక్ మినహాయించాలనుకుంటే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి ఉండాల్సిందని.. అప్పడు ఎవరూ ప్రశ్నించి ఉండేవారు కాదని.. “ పేర్కొంది.