ఖేల్‌రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులను ప్రకటించిన కేంద్రం
ఢిల్లీ (CLiC2NEWS): క్రీడా రంగంలో విశేష ప్రతిభను కనబరిచిన పలువురు క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. 2024 సంవత్సరానికి గాను భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ పురస్కారాలను నలుగురికి ప్రకటించింది. అదేవిధంగా అర్జున అవార్డులను 32 మందికి, ద్రోణాచార్య అవార్డులను ఐదుగురికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పురస్కారాలను ఈ నెల 17వ తేదీన 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా అందుకోనున్నారు.
2024 పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్ లో వ్యక్తిగత, మిక్స్‌డ్ డబుల్స్‌లో కూడా కాంస్య పతకాలను సాధించిన మను బాకర్‌కు ఖేల్‌రత్న పురస్కారం ప్రకటించింది. చెస్ విభాగంలో డి.గుకేశ్, హాకీ విభాగంలో హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్‌కు ఖేల్‌రత్న పురస్కారాలు వరించాయి. పారాలింపిక్స్‌లో ప్రవీణ్ కుమార్ హైజంప్ టి64 విభాగంలో స్వర్ణం సాధించాడు. ఒలింపిక్స్‌లో వరుసగా భారత్ రెండో పతకం సాధించడంలో కీలక పాత్ పోషించిన హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ కు ఈ పురస్కారం వరించింది. ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేత.. గుకేశ్‌ను ఖేల్‌రత్న అవార్డు అందుకోనున్నారు.