చార్‌ధామ్ యాత్ర.. 15 రోజుల్లో 52 మంది మృతి
డెహ్రాడూన్ (CLiC2NEWS): ఉత్తరాఖండ్‌లో ఈ నెల 10వ తేదీనుండి ప్రారంభమైన చార్‌ధామ్ యాత్రకు భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. అక్కడి ప్రతికూల పరిస్థితులను తట్టుకోలేక ఇప్పటి వరకు 52 మంది మృతి చెందినట్లు సమాచారం . మరణించిన వారంతా 60 ఏళ్లకు పైబడినవారేనని అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మాట్లాడుతూ.. గంగోత్రిలో ముగ్గురు, యమునోత్రిలో 12 మంది బద్రీనాథ్‌లో 14 మంది, కేదార్‌నాథ్‌లో 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. వీరిలో ఎక్కువ మంది గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. 50 ఏళ్లకు పైబడి చార్‌ధామ్ యాత్రకు వెళ్లేవారు తప్పనిసరిగా వైద్యపరీక్షలు చేయించుకోఆవలని ఆయన సూచించారు.
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ చార్‌ధామ్ యాత్ర యమునోత్రి నుండి మొదలై గంగోత్రి, కేదార్‌నాథ్ మీదుగా బద్రీనాథ్ వద్ద ముగుస్తుంది. ఈ యాత్ర ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 9,67,302 మంది యాత్రికులు చార్‌ధామ్‌ను సందర్శించినట్లు సమాచారం.