130 ఏళ్లనాటి నటరాజ స్వామి విగ్రహం స్వాధీనం

చెన్నై (CLiC2NEWS): తమిళనాడు పోలీసులు దాదాపు 130 ఏళ్లనాటి నటరాజ స్వామి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేరళలోని పలక్కాడ్‌కు చెందిన శివప్రసాద్ నంబూద్రి అనే వ్యక్తి వద్ద విగ్రహం ఉందని.. దానిని అతను అమ్మడానికి యత్నిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు విగ్రహాలు కొనేవారుగా మారి 26.8 కేజీల నటరాజ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు విగ్రహాలు కొనేవారిగా అవతారమెత్తి శివప్రసాద్ వద్ద విగ్రహం ఉందో లేదో తెలుసుకొనేందుకు ఫోన్లో సంప్రదింపులు జరిపారు. ఎవిడెన్స్కోసం ఫోన్ కాల్స్‌ను రికార్డు చేశారు. శివప్రసాద్ మాటల మధ్యలో 300 ఏళ్ల నాటి నటరాజ విగ్రహం ఉందని.. రూ.8 కోట్లకు విక్రయించాలనుకుంటున్నానని అన్నాడు. దీంతో పోలీసులు కొనుగోలుదారుడిగా.. విగ్రహం కొంటామని, కోయంబత్తూరు రావాలని కోరారు. అనంతరం శివప్రసాద్ మరో వ్యక్తితో కలిసి కోయంబత్తూరు రాగానే.. పోలీసులు శివప్రసాద్ కారును అడ్డగించి తనిఖీ చేశారు. వారి వాహనంలో విగ్రహం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే కారులో వచ్చిన ఇద్దరినీ అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో ఉన్న పోలీసులందరినీ డిజిపి అభినందించారు.