రూ.లక్షల కోట్లతో మెగా డ్యామ్.. నిర్మాణం ప్రారంభించిన చైనా..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టు నిర్మాణాన్ని శనివారం చైనా ప్రారంభించింది. టిబెట్‌లోని యార్లంగ్ జాంగ్బో (బ్రహ్మపుత్ర) నదిపై భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో చైనా ప్రధాని లీ కియాంగ్ పాల్గొన్నారు. టిబెట్‌లోని నైంగ్చీ నగరంలో భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా దీన్ని చేపడుతున్నట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్టు కోసం చైనా దాదాపు 1.2 ట్రిలియన్ యువాన్లు (సుమారు రూ.14 లక్షల కోట్లు) ఖర్చు పెట్టనుంది. చైనా యూజియాంగ్ గ్రూపు పేరతో కొత్తగా ఓ సంస్థను ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టు బాధ్యతలు అప్పజెప్పినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుపై భారత్, బంగ్లాదేశ్ లు అందోళన వ్యక్తం చేస్తున్నాయి.
గతంలో చైనా నిర్మించిన ప్రపంచంలో అతిపెద్దదైన త్రీ గోర్జెస్ డ్యామ్ కన్నా మూడురెట్లు పెద్దది. హిమాలయాల్లో టిబెట్ నుండి అరుణాచల్‌ప్రదేశ్‌కు (బ్రహ్మపుత్ర) నది గమనంలో వంపు తిరిగే ప్రదేశం(గ్రేట్ బెండ్)లో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో రెండు వేల మీటర్లు దిగువకు నది ప్రవహిస్తుంది.
ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణంతో భారత్‌లోని భౌగోళిక ప్రదేశానికి , పర్యావరణానికి తీరని నష్టం కలిగుతుందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు అస్సాం రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డ్యామ్ నుండి ఒక్కసారిగా భారీ పరిమాణంలో నీటిని విడుదల చేస్తే
ఈ భూభాగాలన్నీ ముంపుకు గురయ్యే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టు విషయంలో అనేక శాస్త్రీయ అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని.. భారత్, బంగ్లాదేశ్ లపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని తెలిపింది. భారత్‌లో నదీ ప్రవాహంపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది.