ఎక్స్ పీరియం పార్క్ నగరానికి తలమానికం: చిరంజీవి
ప్రొద్దుటూరు (CLiC2NEWS): రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో ఎకో ప్రెండ్లీ పార్క్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు చిరంజీవి, మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఎక్స్ పీరియం పార్క్ హైదరాబాద్‌కు తలమానికంగా నిలుస్తుందని, ఒక కళాకండంగా మిగిలిపోతుందన్నారు. ఈ ప్రదేశం అందరికన్నా ముందు తనకు తెలిసునని, తాను నగరంలో ఇల్లు కడుతున్నపుడు.. రాందేవ్ కొన్ని మొక్కలు ఇచ్చారన్నారు. విదేశాల్లో చూసిన అరుదైన మొక్కలు ఇండియాకు తీసుకువెళితే బాగుందనిపిస్తుందని.. అవి ఇపుడు నగర శివారులో లభిస్తున్నాయంటే చాలా అనందంగా ఉందన్నారు.
రాందేవ్ నాకు వ్యాపారవేత్తలా కనపడరని.. ఒక కళాకారుడిలా కనిపిస్తారని చిరంజీవిఅన్నారు. కొత్తగా మొక్కలు వచ్చినవి చూస్తారా అని అడుగుతుంటారని గుర్తుచేశారు. ఒకప్పుడు ఇక్కడి మొక్కలు ధరలు వేలు.. లక్షల్లో ఉండేవని, ఇప్పుడు కోట్లల్లో ఉన్నాయన్నారు. దాదపు పాతికేళ్లు మొక్కలపై ప్రయోగాలు చేస్తూ.. విదేశాల్లో ఉన్న అరుదైన మొక్కలను సైతం ఇక్కడకు తీసుకొచ్చారన్నారు. కేవలం వ్యాపార దృక్పథంతో ఇది సాధ్యం కాదని, అందుకే ఆయనను ఒక ఆర్టిస్ట్‌లా చూస్తానన్నారు. ప్రభుత్వం కూడా రాందేవ్ ఆలోచనలకు సహకారం అందించి , టూరిజం అభివృద్దఙకి కృషి చేస్తుందని ఆశిస్తున్నాన్నారు. హైదరాబాద్ నగరానికి ఎక్స్పీరియం పార్క్ అద్భుతమైన ల్యాండ్ మార్క్ అవుతుందని చిరంజీవి అన్నారు.