అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి
రాజమహేంద్రవరం (CLiC2NEWS): ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం రాజమండ్రిలో పర్యటించారు. అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాలలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని చిరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. రాజమండ్రితో తనకు అనుబంధం ఉందని, అసలు మేకప్ వేసుకుందే రాజమండ్రిలో అని పేర్కొన్నారు. అల్లు రామలింగయ్యని మొదటిసారి రాజమండ్రిలోనే కలిశానని గుర్తుచేసుకున్నారు.
‘‘మా ఇద్దరి మధ్య గురుశిష్యుల అనుబంధం ఉంది. సినిమాల్లో ఆయన హాస్యాన్ని పండించారు. కానీ.. రియల్ లైఫ్‌లో మాత్రం జీవితాన్ని ఎంతో సీరియస్‌గా తీసుకున్నారు. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, హోమియోపతి.. ఇలా ఎన్నో గొప్ప విషయాల గురించి ఆయన నాతో చెప్పేవారు. ముఖ్యంగా హోమియోపతి గురించి ఆయన నాకు ఎన్నో విలువైన విషయాలు తెలియజేశారు. నటుడిగా బిజీగా ఉన్నప్పటికీ హోమియోపతి మీద ఉన్న ఆసక్తితో అందులో శిక్షణ తీసుకుని ఆర్‌ఎంపీ పట్టా పొందారు. “ అని చిరంజీవి వివరించారు.