ఎమ్మెల్యేలకు క్లబ్: సిఎం కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): బిఎసి (తెలంగాణ శాసన సభ వ్యవహారాల సలహాసంఘం) సమావేశం ముంగిసింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్, సిఎల్సీ నేత భట్టీ విక్రమార్క తదితరులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీలో కొత్తగా కొన్ని నిబంధనలను, విధివిధానాలను రూపొందించుకొని దేశానికి ఆదర్శంగా నిలవాలి అని సూచించారు. అలాగే హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలకు క్లబ్ నిర్మిస్తామని చెప్పారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ తరహాలో దీన్ని నిర్మిస్తామన్నారు. శాసనసభ్యులంతా ప్రొటోకాల్ ఖచ్చితంగా పాటించాలన్నారు. సభలో ప్రవేశపెట్టే బిల్లులపై సభ్యులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు.
“ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు చేరవేయాలి. అర్ధవంతమైన, ముఖ్యమైన అంశమైతే సమయం ఇవ్వాలి. అలాంటి వాటి కావలసినంత సమయం కేటాయించాలి. తెలంగాణ శాసనసభ దేశానికే ఆదర్శంగా నిలవాలి. సభ్యుల సంఖ్య తక్కువైనా విపక్షాలకు సమయం కేటాయిస్తున్నాం“ అని కేసీఆర్ అన్నారు.
కాగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను అక్టోబర్ 5వ తేదీ వరకు కొనసాగించాలని బీఏసీలో నిర్ణయించిన విషయం తెలిసిందే.
అనంతరం సిఎల్పీ నేత భట్టీ విక్రమార్క మాట్లాడుతూ.. చాలా అంశాలపై చర్చ చేపట్టాల్సి ఉందన్నారు. 20 రోజుల పాటు అసెంబ్లీ జరపాలని కోరారు. ఈ మేరకు 12 అంశాలపై చర్చించాలని కోరుతూ స్పీకర్‌కు జాబితా అందజేశారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ అన్ని పక్షాలపై జాబితా రావాల్సి ఉందన్నారు. అన్ని పక్షాల జాబితా వచ్చాక పనిదినాలు నిర్ణయిద్దామని చెప్పారు.