రుషి కొండ భవనాలను పరిశీలించిన సిఎం చంద్రబాబు
విశాఖ (CLiC2NEWS): ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితం కోసం పర్యావరణం విధ్వంసం చేసి ప్యాలెస్‌లు కట్టుకోవడం ఎక్కడా చూడలేదని సిఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రుషికొండపై నిర్మించిన భవనాలను ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి శనివారం పరిశీలించారు. గతంలో మీడియా, ఇతరులు ఎంత ప్రయత్నించినా రుషికొండపై ఏం చేస్తున్నారో తెలియకుండా చేశారని, ఎవరూ కలలో కూడా ఊహించనిది జరిగినదని సిఎం అన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఒక ముఖ్యమంత్రి విలాసం కోసం ఏ విధంగా చేయగలరో అనే దానికి ఇక్కడి పరిస్థితి ఒక ఉదాహరణ. రుషి కొండ బీచ్ .. విశాఖలోనే అత్యంత అందమైన ప్రాంతమని, భవనాల్లో ఎక్కడ కూర్చున్నా సముద్రం వ్యూ కనిపించేలా కట్టారని తెలిపారు. పూర్వం రాజులు, చక్రవర్తులు కూడా ఇలాంటి భవనాలు నిర్మించలేదని సిఎం తెలిపారు.
ప్రజాధనంతో ఇలాంటి భవనాలు కట్టుకోవడం దారుణమని.. ఒక బాత్ టబ్ కోసం రూ.36 లక్షలు ఖర్చు చేశారని తెలిపారు. గత ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల కోసం రూ.400 కోట్లు కూడా ఖర్చుచేయలే్దు. ఈ నిధులు ఖర్చు పెడితే రోడ్లపై గుంతలు పూడ్చటమన్నా పూర్తయ్యేదన్నారు. ఈ భవనాలు అందరికీ చూపిస్తాం, వీటిని దేనికి వాడుకోవాలో అర్ధం కావడంలేదన్నారు. ప్రజలంటే కొంతైనా భయం ఉంటే సమాధానం చెప్పాలని, అధికారంలో శాశ్వతంగా ఉంటాననే భ్రమలతో ఇలాంటివి కట్టారని సిఎం విమర్శించారు.