పర్యాటక రంగంలో పెట్టుబడులు పెడితే .. ఆరురెట్లు లాభాలు: సిఎం చంద్రబాబు
విజయవాడ (CLiC2NEWS): రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉండేదని, ప్రజలు ఇచ్చిన అక్సిజన్‌తో ఆ స్థితి నుండి బయటపడ్డామని.. కేంద్రం సహకరించకపోతే గుక్క తిప్పుకోలేని, శ్వాస తీసుకోలేని పరిస్థితి.. దీనికి ఎవరు కారణమో ప్రజలే ఆలోచించాలని సిఎం చంద్రబాబు అన్నారు. తాను నాలుగు సార్లు సిఎం అయ్యానని, గతంలో కంటే ఇపుడే అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ప్రధాని మోడీ, డిసిఎం పవన్‌కల్యాణ్ , తాను కలిసి రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని సిఎం తెలిపారు. విజయవాడలోని కృష్ణానది పున్నమిఘాట్ లో సీప్లేన్‌ను ప్రారంభించారు. కేంద్ర మంత్రి రామ్మోహన రాయుడు, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, బిసి.జనార్దన్ రెడ్డి తో కలిసి సీప్లేన్‌లో శ్రీశైలం చేరుకున్నారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి పున్నమిఘాట్‌కు చేరుకున్నారు.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రపంచ పర్యాటకానికి ఎపి గమ్యస్థానంగా మారుతుందని, పర్యాటక రంగంలో పెట్టుబుడులు పెడితే.. ఆరురెట్లు లాభాలు వస్తాయన్నారు. పర్యాటక రంగంలో ఆదాయ వనరుగా సీప్లేన్ అవతరించిందని, సీ ప్లేన్ వంటి నూతన ఆవిష్కరణలతో సంపద సృష్టి అవుతుందన్నారు. సాధారణ విమాన ఛార్జీల స్థాయికే సీప్లేన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురాగలిగితే ఈ రంగానికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఏడాదిలో 10 సీప్లేన్ అభివృద్ధి చేయాలని రామ్మోహన్‌నాయుడికి సూచించాన్నారు. సీప్లేన్ సేవలను మార్చి నుండి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లికార్జున స్వామి క్షేత్రాలను సీప్లేన్‌తో కలపడం తన అదృష్టమని సిఎం చంద్రబాబు అన్నారు.
దేశంలోనే తొలి సీప్లేన్‌ను ప్రారంభించినట్లు మంత్రి రామ్మోహననాయుడు తెలిపారు. ఇదో నూతన అధ్యాయమని.. పర్యాటకరంగంలో పెనుమార్పులు తెచ్చేలా, సామాన్యులకూ అందుబాటు ధరల్లో సీప్లేన్‌లు ఉండేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు వెల్లడించారు.