సిఎం కెసిఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

హైదరాబాద్ (CLiC2NEWS): ద‌ళిత బంధు అవ‌గాహన స‌ద‌స్సులో సిఎం కెసిఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుందని ముఖ్య‌మంత్రి స్పష్టం చేశారు. దళిత బంధు పథకం అమలుపై హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని దళిత ప్రతినిధులతో ప్రగతి భవన్‌లో సోమ‌వారం ముఖ్య‌మంత్రి కెసిఆర్ అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఎ ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. అనంతరం సిఎం మాట్లాడుతూ.. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఎస్సీల భూముల సమస్యలను 10 రోజుల్లో పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. భూసమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు.

హుజూరాబాద్‌లో ఇల్లులేని ఎస్సీ కుటుంబం ఉండకూడదని అన్నారు. ఇల్లులేని వారి వివరాలను గుర్తించాలని అధికారుల‌కు చెప్పారు. ఖాళీ స్థలముంటే ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుందని సిఎం పేర్కొన్నారు.

‘హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో రేషన్‌కార్డులు, పింఛన్లు సహా అన్ని సమస్యలు పరిష్కరించాలి. ప్రతి ఎస్సీవాడలో అధికారులు పర్యటించాలి. వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలు గుర్తించి నివేదిక ఇవ్వాలి. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నుంచి కేంద్రం, ఇతర రాష్ట్రాలు చేర్చుకుంటున్నాయి. దళితబంధు పథకాన్ని కూడా ఇతర రాష్ట్రాలు అనుసరించాలి’ అని ముఖ్య‌మంత్రి ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.