మీరంతా దీవిస్తే ఢిల్లీ కోటలు బద్దలు కొడతా: సిఎం కెసిఆర్

జనగామ (CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం జనగామ లో పర్యటించారు. ఇక్కడ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయాన్ని, తరువాత టిఆర్ ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం యశ్వంత్‌పూర్ వద్ద బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్నారు.
సభలో సిఎం ప్రసంగిస్తూ.. “నాడు బచ్చన్నపేట చౌరస్తాలో సభ పెడితే ఒక్క యువకుడు కనిపించలేదు. అంతా వృద్ధులే కనిపించారు. ఇక్కడి యువకులు వలస వెళ్లారని చెబితే కన్నీళ్లోచ్చాయి. ఒక్కప్పుడు జనగామ ప్రాంత ప్రజల వెతలు చూసి ఆచార్య జయశంకర్, నేను కన్నీళ్లు పెట్టుకున్నం.. ఇవాళ జనగామలో అద్భుతమైన భవనాలు ప్రారంభించుకున్నాం..
గోదావరి నీళ్లు తెచ్చి జనగామ కాళ్లు కడిగే కార్యక్రమం చేపట్టాం.. రాబోయే సంవత్సరంలో ఇక్కడి చెరువుల్లో నీళ్లు నింపుతాం..
జనగామకు సంబంధించి తప్పకుండా మెడికల్ కాలేజీ మంజూరు చేస్తాం, ఇందుకు సంబంధించిన జీవోను రెండు, మూడు రోజుల్లో జారీ చేస్తాం. పాలకుర్తిలో డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తాం.
రాష్ట్రంలోని 17 లక్షల దళిత కుటుంబాలకు విడతల వారీగా దళితబంధు అమలు చేస్తాం. ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళిత బందు ఇస్తున్నాం. దళిత సోదరులకు మెడికల్, ఎరువులు, మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించాం. తెలంగాణ వచ్చి ఏనిమిదేళ్లు అయింది. ఎప్పుడైనా కేంద్రంతో పంచాయతీ పెట్టుకున్నామా?.. కేంద్రం సాయం చేయకున్నా.. కడుపు కట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపుకున్నం, రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నాం. హైదరాబాద్ వెళ్లిన వారు తిరిగి గ్రామాలకు వాపస్ వస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ విద్యుత్ సంస్కరణల పేరిట..వ్యయసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. నన్ను చంపినా సరే మోటార్‌కు మీటరు పెట్టేది లేదు.
తెలంగాణ ప్రజలు ఇచ్చిన శక్తితోనే ఇంత దూరం వచ్చాం.. కేంద్రం పై తిరగబడతాం.. అవసరమైతే ఢిల్లీ వెళ్లి కొట్లాడుతాం.. మేము రైతు బంధు ఇస్తుంటే కేంద్రం రైతు పెట్టుబడి ధరలు పెంచుతోంది. నరేంద్ర మోడీ సర్కార్ రైతుల వెంట పడింది. కుంభకోణాలు చేసి బ్యాంకులను మోసిగించిన వారిని టికెట్లు కొని లండన్ కు పంపిస్తారు..
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిద్దాం. మీరందరూ దీవిస్తే ఢిల్లీ కోటలు బద్దలు కొడతా.. విద్యుత్ సంస్కరణలు అమలు చేయం.. దీని మీద తెలంగాణ మొత్తం అప్రమత్తం కావాలి “అని సిఎం కెసిఆర్ అన్నారు.