రవాణా రంగంలో పెట్టుబడులకు ముందుకు రావాలి: సిఎం రేవంత్ రెడ్డి
దావోస్ (CLiC2NEWS): ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలనే సంకల్పానికి అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా కోరారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ నగరాన్ని ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని పారిశ్రమిక వేత్తలను సిఎం కోరారు. దావోస్‌లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక ఫోరం, సిఐఐ, హీరో మోటార్ కార్ప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడారు. రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభా ఉన్నారని.. వారికి రవాణా సౌకర్యాలు అందించేందుకు సహకరించాలన్నారు. రాష్ట్రానికి తీరం లేని లోటును పూడ్చేందుకు డ్రైపోర్టుకు సమీపంగా ఉండే ఎపిలోని మచిలీపట్నం పోర్టుకు ప్రత్యేకంగా రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానం చేయనున్నట్లు సిఎం ఈ సందర్భంగా వెల్లడించారు.
దేశంలో అత్యధిక ఇవి వాహనాల విక్రయాలు తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ ప్యూచర్ సిటిలో ప్రపంచంలోనే అత్యుత్తమ మెబిలిటి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు, దీంతో పాటు.. పర్యావరణ అనుకూల వ్యవస్థలు అవసరమన్నారు. జిహెచ్ ఎంసి పరిధిలో 3వేల ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ వాహనాలపై రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రద్దు చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో కోటి 20 లక్షల జనాభా ఉన్నారని, దాదాపు 100 కిలోమీటర్లకు పైగా కొత్తగా మెట్రో లైన్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. నగరాల అభివృద్ధికి , భవిష్యత్తుకు అర్బన్ మొబిలిటిపునాది వంటిదని.. తక్కువ ఖర్చు, వేగంగా చేరుకునే రవాణా సదుపాయాలున్న నగరాలే ఎక్కువకాలం మనగలుగుతాయన్నారు. రవాణా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు సిఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.