ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్క్‌ను ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి
పొద్దుటూరు (CLiC2NEWS): ప్రపంచస్థాయి ప్రమాణాలతో 150 ఎకరాల్లో ఏర్పాటు చేసిసన ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్క్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పార్క్‌లో 25వేల జాతుల మొక్కలు.. 85 దేశాల నుండి దిగుమతి చేసుకున్న అరుదైన వృక్షాలు, చెట్లు ఉన్నాయి. రాందేవ్ ఆరున్నరేళ్ల పాటు శ్రమించి ఎక్స్ పీరియంను తీర్చిదిద్దారు. దీనిలో వివిధ ఆకృతుల్లో రాక్ గార్డెన్ సిద్ధం చేశారు. 1500 మంది ఒకే చోట కూర్చునేలా యాంఫీ థియేటర్‌ను కూడా ఈ పార్క్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సినినటుడు చిరంజీవి , ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సిఎం మాట్లాడుతూ.. తెలంగాణకు టెంపుల్, హెల్త్, ఎకో టూరిజం రావాలని.. ఇవి రాష్ట్రానికి గుర్తింపు తీసుకువస్తాయన్నారు. ఇటీవల క్యాబినేట్లో ఎకో టూరిజం గురించి చర్చించామని.. త్వరలో టూరిజం పాలసి తీసుకొస్తామన్నారు. తెలంగాణను ప్రకృతివనంగా మార్చాల్సి ఉందన్నారు.
ఎకో టూరిజం ప్రారంభించడానికి తన పాతిక సంవత్సరాల ఆదాయాన్ని, అనుభవాన్ని ఈ 150 ఎకరాల్లో పార్క్‌ను ఏర్పాటు చేసి తనతోపాటు చిరంజీవి, మంత్రులు లతో కలిసి ప్రారంభింపజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
శుభకార్యక్రమాలు చేయాలంటే ఇతర దేశాలు, రాష్ట్రాలకు వెళుతున్నారని.. కానీ అన్ని సదుపాయాలున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మందిరాలున్నాయని, నల్లమల్ల టైగర్ ఫారెస్ట్, కృష్ణానది జలాల పారిస్తున్న ప్రాంతం, మల్లెల తీర్థం వంటి ప్రాంతాలున్నాయన్నారు. గత ప్రభుత్వాలు వీటికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఎకో టూరిజం వెనుకబడిందన్నారు. ఎకో టూరిజం కింద త్వరలో వికారాబాద్‌ను అభివృద్ధి చేస్తామని, రాష్ట్రంలో మరిన్ని పర్యాటక క్షేత్రాలు రావాల్సి ఉందన్నారు. తల్లి పేరిట విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షించే విధానం తీసుకొస్తామని, త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామని సిఎం అన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఈ పార్క్ దేశానికే కాదు, ప్రపంచానికి తలమానికమన్నారు. గడిచిన 25 ఏళ్ల నుండి ఒక కలని సుదీర్ఘంగా తపన పడుతూ దీనిని నిజం చేశారన్నారు. హైదరాబాద్ అంటే ఆకాశహార్మ్యలు , గుడులు, చెరువులతో పాటు ఎక్స్ పీరియం కూడా వచ్చిందన్నారు. ఇంత గొప్ప నిర్మాణాన్ని చేపట్టిన రామ్‌దేవ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినందుకు రామ్‌దేవ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. లండన్, పారిస్ కాదు.. మన నగరంలో 85 దేశాల నుండి మొక్కలు తెచ్చి ఆహ్లాదకరంగా చేసినందుకు ఆయనకు భగవంతుడు మరింత శక్తినివ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఈ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరింపచేయాలని సిఎంను కోరారు.