పాలమూరు అభివృద్ధిని కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారు: సిఎం రేవంత్ రెడ్డి
ల
చిన్న చింతకుంట (CLiC2NEWS): పాలమూరు అభివృద్ధిని కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్‌లో కురుమూర్తి స్వామిని సిఎం దర్శించకున్నారు. అనంతరం ఆలయ సమీపంలోని ఘాట్ రోడ్ కారిడార్ నిర్మాణానికి సిఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు బిడ్డకు సిఎం అయ్యే అవకాశం వచ్చిందంటే కురుమూర్తి స్వామిదయేనని.. పేదల తిరుపతిగా స్వామిని కొలుస్తారన్నారు. ఇక్కడ దర్శించుకుంటే తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లేనన్నారు. ఇప్పటికీ ఆలయంలో మౌలిక సదుపాయాలు లేవని.. అందుకే రూ.110 కోట్లతో ఘాట్ రోడ్డు కారిడార్ నిర్మిస్తున్నామని తెలిపారు.
దేశంలో ఏ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలోనైనా పాలమూరు ప్రజల కృషి ఉందని.. గత ప్రభుత్వం పాలన వలన ప్రాజెక్టులు పూర్తికాలేదన్నారు. ఇక్కడి బిడ్డనై ఉండి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేక పోతే ప్రజలు క్షమించరు. మక్తల్, నారాయణ్‌పేట్, కొడంగల్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు.