మా ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తాం.. సిఎం రేవంత్‌రెడ్డి

మహబూబ్‌నగర్ (CLiC2NEWS): ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికొస్తే.. అంతు చూస్తామని సిఎంరేవంత్ రెడ్డి హెచ్చరించారు. మహబూబ్‌నగర్ లో నిర్వహించిన ‘పాలమూరు ప్రజాదీవెన’ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనున్నట్లు తెలిపారు. తొలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.
ప్రధాని మోడీకి వినతిపత్రం ఇస్తే కొందరు విమర్శిస్తున్నారని.. రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని అడగాల్సిన బాధ్యత ఒక సిఎంగా ఉందన్నారు. అడిగిన పనులు చేయకపోతే చాకిరేవు పెడతామని.. రాష్ట్ర అభివృద్ధికి మోడీ సహకరించకపోతే అన్ని రాష్ట్రాలు తిరిగి మరీ కేంద్రంపై పోరాటం చేస్తానని వెల్లడించారు.
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొతామంటున్నారు.. కెసిఆర్ సిఎంగా.. మోడీ ప్రధానిగా పదేళ్లు ఉండొచ్చకానీ.. ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ల ప్రభుత్వం వస్తే ఆరు నెలలు కూడా ఉండనీయరట. ఇదెక్కడి న్యాయం అంటూ సిఎం ప్రశ్నించారు. పాలమూరు పేద బిడ్డ ఈ రాష్ట్రాన్ని పాలించకూడదా అని ప్రశ్నించారు. 2024 నుండి 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ఈ సందర్భంగా సిఎం ధీమా వ్యక్తం చేశారు.