మెట్టుగూడలోని చింత‌బావిలో జ‌ల‌మండ‌లి ఉన్న‌తాధికారుల ప‌ర్య‌ట‌న‌

సికింద్రాబాద్ (CLiC2NEWS): చింతబావి బస్తీలో గురువారం కలుషిత తాగునీరు సరఫరా అయిందనే వార్తలు వ్యాప్తి చెందిన నేపథ్యంలో.. జలమండలి ఇఎన్‌సి, ఆపరేషన్స్ డైరెక్టర్ -1 అజ్మీరా కృష్ణ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు మెట్టుగూడలోని చింత‌బావి ప్రాంతాన్ని సందర్శించారు.

ఉన్న‌తాధికారుల నివేదిక ప్ర‌కారం.. మంగళవారం స్థానిక లైన్ మెన్‌లు తాగునీరు విడుదల చేసిన మొదటి 5-10 నిమిషాల వరకు.. 15 నుండి 20 గృహాల వినియోగదారులకు కలుషిత నీరు సరఫరా అయినట్లు గుర్తించి అధికారుల‌కు తెలియ‌జేశారు. దీంతో అప్ర‌మత్త‌మైన అధికారులు.. వెంటనే సరఫరాను నిలిపివేసి ఆ వినియోగదారులకు నీరు తాగునీటిని ఉప‌యోగించ‌వ‌ద్ద‌ని సూచించారు. వారికి తాత్కాలికంగా ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరా చేశారు. అనంత‌రం పొల్యూషన్ చెకింగ్ యంత్రంతో పైపు లైనును ప‌రీక్షించారు. ఈ ప‌రీక్ష‌ల ఫలితాల ప్రకారం.. అక్కడున్న సీవరేజీ మ్యాన్ హోల్ కు దగ్గరలో ఉండే ఒక గృహ కనెక్షన్ నుంచి మంచినీటి పైపు లైనులోకి మురుగు నీరు కలిసినట్లు నిర్ధార‌ణ అయింది.

రెండో స‌ప్లై లో 27వ తేదీ సైతం మొదటి కొన్ని నిమిషాల వరకు కలుషిత నీరు సరఫరా అయింది. అయితే.. దీనికి కార‌ణం అప్పటికే అందులో నిలిచి ఉన్న మురుగు నీరు మళ్లీ కలవడ‌మే. దీంతో సంబంధిత సీజీఎం, క్వాలిటీ సెల్ జీఎంలు ఘటనా స్థలాన్ని సందర్శించి క్లోరిన్ పరీక్షలు నిర్వహించారు. అందులో క్లోరిన్ శాతం 0.2 పీపీఎంగా తేలింది.  వైద్యుల్ని సంప్రదించి బాధితుల ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. అందులో కొంతమంది డయేరియా, జ్వరంతో బాధపడుతున్నారు. అయినప్ప‌టికీ వారి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉండ‌టంతో ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదని, మిగిల‌న వారు ఆరోగ్యంగానే ఉన్నార‌ని వైద్యులు తెలిపారు.

డిప్యూటీ స్పీకర్ పద్మారావు జలమండలి అధికారులతో మాట్లాడారు. వెంట‌నే పాత సీవరేజి పైపు లైనును తొల‌గించి దాని స్థానంలో కొత్తదాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అప్పటి వరకు ఆ ప్రాంత వాసులకు ట్యాంకర్ల ద్వారా తాగు నీరు సరఫరా చేయాలని సూచించారు.

 

Leave A Reply

Your email address will not be published.