Corona: వైద్య సిబ్బంది నియామకానికి సిఎం కెసిఆర్ ఆదేశం

హైదరాబాద్(CLiC2NEWS): కరోనా కష్టకాలంలో సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2.3 నెలల కాలానికి తాత్కాలిక ప్రాదిపాతికన వైద్య సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో దాదాపు 50 వేల మంది వరకు నియామకాలు చేపట్టవచ్చని అంచనా.. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, బెడ్లు, ఇతర కరోనా సౌకర్యాల పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
భవిష్యత్ ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజీ
“కష్టకాలంలో ప్రజలకు సేవ చేసేందుకు యువ వైద్యులు ముందుకు రావాలి. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో తక్షణమే సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రారంభించాలి. వాటిల్లో సిబ్బందిని కూడా తక్షణం నియమించుకోవాలి“ అని సిఎం కెసిఆర్ ఆదేశించారు.
స్వల్ప కాలానీకి నియమించుకున్న వైద్య సిబ్బందికి గౌరవ ప్రదమైన రీతిలో జీతాలు అందించాలన్నారు. అంతేకాకుండా వారు కరోనా వంటి కీలక సమయంలో రాష్ట్రం కోసం పనిచేస్తున్నందున వారి సేవలకు సరియైన గుర్తింపునివ్వాలన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వారికి వెయిటేజీ మార్కులను కలపాలని సీఎం ఆదేశించారు.
ఎంబీబీఎస్ పూర్తిచేసి సిద్దంగా వున్న అర్హులైన వైద్యుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించారు. రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో వారి సేవలను వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ వైద్యాధికారులను ఆదేశించారు. https://odls.telangana.gov.in/medicalrecruitment/Home.aspx. డాక్టర్లతో పాటు రాష్ట్రంలో అర్హతవున్న నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు.
పీఎంఎస్ఎస్‌వై కింద ఎంజిఎంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ నిర్మాణానికి ప్రభుత్వ వాటాకింద తక్షణం అందచేయాల్సిన రూ. 8 కోట్లు, రిమ్స్ లో ఇదే పథకం కింద నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానకు ప్రభుత్వ వాటాకింద రూ. 20 కోట్ల రూపాయలను, మొత్తం రూ. 28 కోట్లను తక్షణమే విడుదల చేయాలని ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. అదే సందర్భంలో వరంగల్ దవాఖానా కోసం 363 వైద్య సిబ్బందిని, అదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ కోసం 366 మంది వైద్యసిబ్బందిని, మెత్తం 729 సిబ్బంది నియామకానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు తన్నీరు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, కొవిడ్ సీఎంవో ప్రత్యేక అధికారి రాజశేఖర్ రెడ్డి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ కె.రమేష్ రెడ్డి, కాళోజి హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టెక్నికల్ అడ్వైజర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.