corona vaccine: ప్రక్రియ ముమ్మరం చేయండి: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ (CLiC2NEWS): ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగం తగ్గకుండా రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి మోడీ అన్నారు. కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రాలు, జిల్లాల వారీగా కొవిడ్-19 పరిస్థితిపై సమీక్షించారు. కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్నందున దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. లాక్ డౌన్ లు అమల్లో ఉన్నా ప్రజలు వ్యాక్సిన్ వేసుకునేందుకు వెనకాడరాదని, వ్యాక్సినేషన్ డ్యూటీలో ఉన్న ఆరోగ్య సిబ్బందిని వేరే విధులకు మళ్లించరాదని సూచించారు.
ఇప్పటి వరకు రాష్ట్రాలకు 17.7 కోట్ల టీకాలు సరఫరా చేసినట్లు అధికారులు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. 45 ఏల్లు పైబడిన అర్హత కలిగిన జనాభాలో 31శాతం మందికి తొలి మోతాడు టీకా ఇచ్చారని అధికారులు ప్రధానికి తెలిపారు. ఈ సందర్భంగా టీకా వృథాపై రాష్ట్రాల వారీగా ఉన్న పరిస్థితిని మోడీ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.
ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రాష్ట్రాలకు సహకరించాలని అధికారులు, కేంద్ర మంత్రులను కోరారు. 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులున్నాయని ప్రధానికి అధికారులు వివరించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల వివరాలను నివేదించారు. కరోనా చికిత్సలో ఉపయోగించే మందుల లభ్యతను ప్రధాని సమీక్షించారు. రెమ్డిసివిర్ సహా కరోనా ఔషధాల ఉత్పత్తిని పెంచినట్టు అధికారులు ప్రధానికి వివరించారు.
కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్‌షా, నిర్మలాసీతారామన్, హర్షవర్ధన్, పీయూష్ గోయల్, మన్సుఖ్ మాండవియా, పలు శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.