కరోనా నుంచి కోలుకున్నవారికి క్ష‌య ముప్పు!

టీబీ పరీక్షలు చేయించుకోవాలి: కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ‌

న్యూఢిల్లీ (CLiC2NEWS): కరోనా బాధితుల‌కు క్ష‌య (టిబి) ముప్పు ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంద‌ని.. బ్లాక్ ఫంగ‌స్‌లాగే టీబీ కూడా అదునుచూసి విరుచుకుపడే అవ‌కాశ‌వాద‌ ఇన్‌ఫెక్ష‌నే అని కేంద్ర ఆరోగ్య‌శాఖ పేర్కొంది. కరోనా నేపథ్యంలో క్షయ కేసులు పెరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు శనివారం కీలక ప్రకటన చేసింది. మహమ్మారి బారినపడి కోలుకున్న వారంతా తప్పనిసరిగా టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతోపాటు టీబీ వ్యాధిగ్రస్థులు సైతం కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. ఈ విషయంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు దృష్టి సారించాలని.. టీబీ పరీక్షలను పెంచాలంటూ స్పష్టంచేసింది.

కాగా కరోనా నుంచి కోలుకున్న రోగులు క్షయ వ్యాధి (టీబీ) బారిన పడుతున్నారన్న వార్తలను కేంద్ర ఆరోగ్యశాఖ ఖండించింది. టీబీ కేసుల పెరుగుదలకు.. కరోనా కారణం అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవంటూ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఈ రెండు వ్యాధుల‌కు ఉన్న సారుప్య‌త‌ను వివ‌రించింది. ఈ రెండూ వ్యాధిగ్ర‌స్థుల నుంచి ఇత‌రుల‌కు వేగంగా సంక్ర‌మిస్తాయ‌ని.. ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తాయని దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను సృష్టిస్తాయంటూ తెలిపింది. టీబీ, బ్లాక్ ఫంగస్ వంటి వ్యాధులు ప్రధానంగా బలహీన వ్యక్తులపైనే దాడి చేస్తాయని.. కావున కరోనా నుంచి కోలుకున్న వారు తమ ఇమ్యూనిటీని పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేసింది. ఏ కార‌ణం వ‌ల్ల‌నైనా రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గిన‌ప్పుడు తీవ్ర‌త‌ను పెంచుతుంద‌ని వివ‌రించింది. కొవిడ్ త‌ర్వాత కూడా ఎవ‌రిలోనైనా రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గితే ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.