అక్రమ నల్లా కనెక్షన్ తీసుకున్న 25 మందిపై క్రిమినల్ కేసులు
ఈ ఒక్క రోజే నలుగురిపై కేసులు
హైదరాబాద్ (CLiC2NEWS):జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటి పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్లు పొందిన నలుగురి మీద జలమండలి విజిలెన్స్ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నాలుగు భవనాలకు తీసుకున్న అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించారు.
వివరాల్లోకి వెళ్తే… జలమండలి ఓ ఆండ్ ఎం డివిజన్ -6లోని తట్టిఖానా సెక్షన్ పరిధిలోని బంజారాహిల్స్ ఇందిరానగర్‌కు చెందిన నలుగురు తమ నివాసాలకు 15 ఎంఎం పైప్ సైజ్ అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకున్నారు. జలమండలి విజిలెన్స్ విభాగం తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకున్న నలుగురిపైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో యు/ఎస్ 269, 430 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఐదు రోజుల్లో 25 మందిపై కేసులు
తట్టిఖానా సెక్షన్ పరిధిలో అక్రమ నల్లా కనెక్షన్లపై జలమండలి విజిలెన్స్ విభాగం కొరడా ఝులిపిస్తోంది. ఈ సెక్షన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా జలమండలి విజిలెన్స్ విభాగం తనిఖీలు చేస్తోంది. మొత్తం 25 అక్రమ నల్లా కనెక్షన్లను విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. అక్రమ కనెక్షన్లను తొలగించడంతో పాటు తీసుకున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
అక్రమ నల్లా కనెక్షన్లు ఇచ్చిన ఇద్దరు జలమండలి ఔట్సోర్సింగ్ సిబ్బందిని విధుల నుంచి కూడా తొలగించారు. అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించినట్లయితే జలమండలి విజిలెన్స్ బృందానికి లేదా 9989998100, 9989992268 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగలరు.